ట్రంప్ నోట మళ్లీ అదే మాట
ఇప్పటికే 90 సార్లకు పైగా ఈ తరహా ప్రకటనలు
మోడీపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పల్లవి అందుకున్నారు. తన ప్రభుత్వం గత సంవత్సరం భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నివారించిందని ఆయన చెప్పుకొచ్చారు. నేషనల్ ప్రేయర్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో ఆయన గురువారం ప్రసంగిస్తూ సంవత్సర కాలంలోనే ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలను తప్పించానని అన్నారు. కాంబోడియా-థాయిలాండ్, కొసావో- సెర్బియా, అర్మేనియా-అజర్‌బైజాన్, భారత్-పాకిస్తాన్ ఘర్షణలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనంతరం ఆయన తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెడుతూ భారత్, పాక్ మధ్య అణు యుద్ధం జరగకుండా ఆపేశానని తెలిపారు. ‘ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం.
నేను తొలిసారి అధ్యక్షుడిని అయినప్పుడు సైన్యాన్ని పూర్తిగా పునర్నిర్మించా. కొత్తగా అనేక అణ్వాయుధాలను తయారు చేయించా. అంతరిక్ష దళాన్ని కూడా ఏర్పాటు చేశా. ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా సైన్యాన్ని పునర్నిర్మించే పనిని కొన సాగిస్తున్నా’ అని వివరించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సముద్రంలో తిరుగాడిన యుద్ధ నౌకలతో పోలిస్తే వంద రెట్లు అధిక శక్తివంతమైన నౌకలను అమెరికా అమ్ములపొదిలో చేర్చానని ట్రంప్ చెప్పారు. భారత్-పాక్ మధ్యే కాకుండా ఇరాన్-ఇజ్రాయిల్, రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా అణు యుద్ధాలను నివారించానని అన్నారు. ట్రంప్ ఇప్పటికే 90 సార్లకు పైగా బహిరంగ వేదికల పైన, సామాజిక మాధ్య మాలలో ఈ తరహా ప్రకటనలు చేయడం గమనార్హం.
వాషింగ్టన్ స్నేహితుడు సెంచరీకి చేరువయ్యారు : కాంగ్రెస్
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆపరేషన్ సిందూర్‌ను ఆపే విషయంలో జోక్యం చేసుకున్నానని చెప్పుకోవడంలో ‘వాషింగ్టన్ డీసీలో ప్రధానికి ఉన్న మంచి స్నేహితుడు’ సెంచరీ చేయడానికి చేరువలో ఉన్నప్పటికీ మోడీ మాత్రం పూర్తి మౌనం వహిస్తున్నారని ఎద్దేవా చేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన సమాధానంపై కూడా మండిపడింది. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే లేవనెత్తిన ప్రశ్నలలో దేనికీ ఆయన సమాధానం చెప్పలేదని ధ్వజమెత్తింది. ‘రాజ్యసభలో ప్రధాని ప్రసంగాన్ని గమనిస్తే ఆయన ఎంతటి అభద్రతాభావంతో ఉన్నారో అర్థమవుతుంది. ఆయన నిరంతరం అబద్ధాలనే ప్రచారం చేస్తున్నారు. పక్షపాతంతో, ద్వేషంతో వ్యవహరిస్తున్నారని ఆయన ప్రసంగం ద్వారా స్పష్టమైంది. ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. తాను గొప్పవాడినని ఆయన ఎంతగా ప్రకటించుకున్నప్పటికీ ఆయన మంచివాడు కాదని, ఎప్పటికీ కాలేరని మరింతగా స్పష్టమవుతోంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు.



