Friday, May 23, 2025
Homeప్రధాన వార్తలునరమేధం ఆపండి

నరమేధం ఆపండి

- Advertisement -

– మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి ఆపరేషన్‌ కగార్‌ను నిలిపేయాలి
– అటవీ సంపద, వనరులను కార్పొరేట్లకు అప్పగించొద్దు
– నంబాల కేశవరావు, మావోయిస్టుల హత్యపై న్యాయ విచారణ చేపట్టాలి : వామపక్ష నేతల డిమాండ్‌
– హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం
– పాక్‌తో సంప్రదింపులు జరిపే మోడీ సర్కారు..
– మావోయిస్టులతో చర్చలెందుకు జరపదు ?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులను కేంద్ర బలగాలు కాల్చి చంపడాన్ని వామపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర బలగాలు చేపట్టిన నరమేధాన్ని తక్షణమే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉగ్రవాదులను అంతం చేయడం కోసం పాకిస్తాన్‌తో సంప్రదింపులు జరిపే మోడీ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతిచర్చలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. వెంటనే చర్చలు జరపాలని కోరారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టుల హత్యపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలని అన్నారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపేయాలని చెప్పారు. ఆదివాసీ జాతి హననం ఆపాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ‘మావోయిస్టుల హత్యను ఖండించండి, మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వ హత్యాకాండ, ఆదివాసీలపై హింసకు వ్యతిరేకంగా పోరాడదా ం, ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపేయాలి, మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి, మావోయిస్టుల హత్యపై న్యాయ విచారణ జరపాలి’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులను ప్రదర్శించారు.
సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకే ఈ దాడులు : ఎస్‌ వీరయ్య
ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులపై నరమేధాన్ని వెంటనే ఆపాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపేయాలని కోరారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలన్నారు. అటవీ సంపద, ఖనిజాలు, వనరులు, భూమిని అంబానీ, అదానీ వంటి కార్పొరేట్‌ సంస్థల అధిపతులకు అప్పగించడం కోసమే ఆపరేషన్‌ కగార్‌ను చేపట్టిందని విమర్శించారు. శాంతిభద్రతల సమస్యగా సృష్టించి బూటకపు ఎన్‌కౌంటర్లను చేస్తున్నదని అన్నారు. డెడ్‌లైన్‌ విధించి మావోయిస్టులు, ఆ సంస్థలను అంతం చేస్తామంటూ కేంద్రం ప్రకటించిందని చెప్పారు. ఇలాంటి భయానక దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలని కోరారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృక సమస్యగా పరిగణించి చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు. శాంతిభద్రతల సమస్యగా చూడ్డం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ప్రజలంతా ఉద్యమించాలని అన్నారు. మావోయిస్టులపై దాడుల పేరుతో ఆదివాసీలను చంపుతున్నారని విమర్శించారు. సంపదను బడాబాబులకు ఎలా కట్టబెట్టాలన్న మోడీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మావోయిస్టులను సాకుగా చూపి దాడులు చేస్తున్నదని అన్నారు. మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మావోయిస్టులతో చర్చలెందుకు జరపడం లేదని ప్రశ్నించారు. చర్చలు జరపకుండా వారిని ఏరివేయడం ఫాసిస్టు ప్రభుత్వ లక్షణమని విమర్శించారు. ఉగ్రవాదుల సమస్య పరిష్కారానికి పాకిస్తాన్‌తో సంప్రదింపులు జరుపుతున్న మోడీ ప్రభుత్వం రాజకీయ సమస్య పరిష్కా రానికి మావోయిస్టులతో చర్చ లెందుకు జరపడం లేదని ప్రశ్నిం చారు. ప్రజా సమస్యలు పరిష్కారం కాకుంటే మావోయిస్టులు కాకుంటే మరో రూపంలో ప్రతిఘటన వస్తుందన్నారు. ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవడం కోసం ప్రజలు ముందుకొస్తారని చెప్పారు.
ప్రజావాణిని మోడీ పట్టించుకోవడం లేదు : పశ్యపద్మ
మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ ప్రజలు, మేధావులు కోరుతున్నా ప్రధాని మోడీ ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ డిమాండ్‌ చేశారు. మావోయిస్టుల హత్యపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కోరారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఎంత మంది నక్సలైట్లను పొట్టనపెట్టుకున్నారో, ఎంత మంది గాయపడ్డారో పూర్తి వివరాలతో శ్వేతపత్రం ప్రకటించాలన్నారు. ఇది ప్రజాస్వామిక పాలనా, హిట్లర్‌ నియంత పాలనా?అని ప్రశ్నించారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడె మోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హన్మేష్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ మురహరి, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఫార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర నాయకులు ప్రసాద్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఆదివాసీలను అణచివేస్తు న్నారని విమర్శిం చారు. అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టి ఆ సంపద, ఖనిజాలను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు అప్పజెప్పడం కోసమే ఈ కుట్ర జరుగుతున్నదని అన్నారు. దేశంలో నిర్మూలించాల్సింది సంస్థలు, వ్యక్తులను కాదనీ, పేదరికాన్ని, ప్రజల సమస్యలను అని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు అయినా పేదరికం ఎందుకుందని ప్రశ్నించారు. ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే ఆపాలనీ, మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్‌బాబు, పి ఆశయ్య, ఎం అడివయ్య, ఎం వెంకటేశ్‌, సీపీఐ నాయకులు స్టాలిన్‌, కె కాంతయ్య, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు, జెవి చలపతిరావు, కె గోవర్ధన్‌, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకులు ఎస్‌ఎల్‌ పద్మ, ప్రదీప్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -