– సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులపై ఎస్మా, డిస్మిస్, మెమో లాంటి బెదిరింపు ధోరణితో ఇబ్బందులకు గురిచేయకుండా న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టిజన్లతో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఆయన లేఖలు రాశారు. ‘తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఇతర విభాగాల్లో 23 వేల మందికిపైగా ఆర్టిజన్‌గా పనిచేస్తున్నారు. వారంతా మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. చట్టబద్ధంగా సమ్మె నోటీసు ఇచ్చారు. కాలపరిమితి ప్రకారం అధికారులు స్పందించక పోవటంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. సమ్మె చేస్తున్న కార్మికులను ఎస్మా, డిస్మిస్, మెమో లాంటి బెదిరింపు ధోరణితో ఇబ్బందులకు గురిచేయడం సరిగాదు. వారి న్యాయమైన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలి. గత ప్రభుత్వం ఆర్టిజన్ అనే పేరుతో కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేసే విధంగా చట్టం చేసి పదేండ్లుగా వేతనాలు ఇవ్వడంలోనూ, పదోన్నతులు కల్పించడంలోనూ, విద్యార్హతను బట్టి సముచిత స్థానం ఇవ్వడంలోనూ తీవ్ర వివక్ష వహించిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా వారి పట్ల ఇలా వ్యవహరించడం తగదు. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో కార్మికుల సమ్మెతో ఉత్పత్తిపై ప్రభావం పడుతున్నది. ఈ పరిస్థితుల్లో పట్టింపులకు వెళ్లకుండా ఆర్టిజెన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి’ అని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
బెదిరింపులు మానండి.. ఆర్టిజన్లతో చర్చలు జరపండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



