లోపల, బయట రెండు స్థితులు. అవును, కాదు రెండు విషయాలు, వెలుగు నీడలు రెండు. ప్రతీదానికి రెండు అంచులు. ద్వైతం ఒక వాస్తవం. దీన్ని పరాస్తం చేస్తూ అద్వైతం తెరముందు ఒకటి, తెరవెనుక మరొకటి. దూరం నుండి పాముగా దగ్గరకొస్తే తాడుగా కనిపించే భ్రాంతి ఒక అనుభవం. కనిపించేదాని వెనక కనిపించనిది ఒకటి ఉంటుంది. మనసులో ఒకటి మాటలో మరొకటి. చేతలో ఒకటి రాతలో ఇంకొకటి. ఈ ద్వైదీభావంలో నుండే ఘర్షణ పుడుతుంది. అది చింతనకు దారితీస్తుంది. అందులో నుండి సామాజికామోదం గల విషయం బయటపడుతుంది. ఇదే సమయంలో సామాజికా మోదం ఉండని వ్యక్తిగతాసక్తులకు చెందిన విషయాలు వెనక్కు నెట్టబడతాయి. కొందరు వెనక్కు నెట్టబడిన విషయాలను ప్రస్థావిస్తూ సాహితీసృజన చేస్తారు. అలారాసినవే ”అపురూప” (చింతన కథలు) సంకలనంలోని కథలు.
ఆయా రచయితల మనోవల్మీకంలో పురుడు పోసుకున్న ఆలోచనలు కథలుగా కొలువుదీరాయి. నిపుణులైన రచయితల కథల్లో ద్వైతం ఒక కథగా భాసిల్లింది. స్వయంగా కథకుడు అయిన అజరుప్రసాద్ సంకలనకర్తగా పనిచేసిన ఈ పుస్తకంలో ఇరవై కథలున్నాయి. మనిషి తన లోపలికి, బయటకు చేసిన ప్రయాణాన్ని దాని తాలూకు అనుభవాల్ని, ఆలోచనల్ని తెలిపే కథలివి. ఆ ప్రయాణంలో తన సంచారవిహారాల్ని, చిరునామాను స్వేచ్ఛారీతిలో కథల్లో పొందుపరచారు. రుజు వక్రమార్గాల సమ్మిళిత కథన రీతి తనదైన చారికలను ఏర్పరచింది. ఆ చారికలే ఆయా కథల అస్తిత్వాలు. కల-నిజం, కల్పన-వాస్తవం వీటి మధ్య పల్చటి తెర. తెరపగులు నుండి వెడలిన మసక వెలుతురు అందించిన కథలివి. చీకటి రుచి తెలిసిన నీడల జాడలివి. స్థిమితం లేని జీవితంలో అయిష్టంగా, అసహనంగా ఒకరుంటే, అస్థిమితాన్ని ఇష్టంగా మలచుకొని జీవించేవారు మరకొరు. ఇద్దరి నడకల్ని ‘జెన్’ కథ (పతంజలి శాస్త్రి) అందించింది.
ఊహకాస్త భౌతిక వాస్తవికతగా రూపు కట్టడం ”వెదురుపువ్వు” కథ. (మధురాంతకం నరేంద్ర) గమ్యం చేరాక దానంతటదే పుష్పిస్తదనే కండిషన్, మిస్టిక్ ప్రయాణంలో పువ్వును పదిలంగా పట్టుకొని రావడంలోని అవస్థ కథనంగా మారింది. గతాన్ని తల్చుకుంటూ, భవిష్యత్తును ఊహిస్తూ బతికే మనుషులకన్నా వర్తమానంలో బతుకు రుచిని చూసే మనుషులు మిన్న. గడుస్తున్న రోజులలో కలిగే చిన్న చిన్న సంతోషాలను మనసుపెట్టి అనుభవిస్తే కలిగే సౌఖ్యాన్ని .”ఒక సాయంత్రపు అదృష్టం” (మహ్మద్ ఖదీర్ బాబు) చూపెడుతుంది. ”తత్త్వశాస్త్రమైతే పెరుగుతుంది కాని కార్యాచరణ మాత్రం తగ్గుతుంది” అనే విలువైన విషయాన్ని ”పాఠాంతరం” కథ (చినవీర భద్రుడు) చెప్పింది. ప్రపంచం కార్యశీలతను కోరుకుంటుందనే నిజాన్ని కథలోని మేథో చర్చ రుజువు చేసింది. అనేకాన్ని మోసుకు తిరిగే వాడిలోని విశ్లేషణ ఇవ్వని అనుభవం భక్తితో, ఏకంలో మమేకమైనపుడు కలుగుతుందని ఐకాంతిక (బండి నారాయణస్వామి) తెలుపుతుంది. నిత్యజీవితంలో చావుల గురించి అనేక రకాల మాటలున్నాయి.
”ఏం చావు అది. రాజులా పోయాడు” అనేది ఒకటి. ”ఎట్లా బతికాడో గానీ చావు మాత్రం హాయిగా పోయాడు” అనేది ”ఏం జీవితం” కథలోని (చంద్ర) మాట. సముద్రం (రమణజీవి) కథలో పిచ్చివాడితో కథ చెప్పిస్తాడు రచయిత. సముద్రాన్ని తవ్వడమనేది పిచ్చిపనిగా కనిపిస్తుంది. అసంబద్ద కథనం ఔచిత్యాన్ని ప్రదర్శించింది. లోయలోకి జారుతూ ఎగురుతున్న అనుభూతిని పొందడం అందమైన ఊహ. నడిచీ నడిచీ విసిగిన మనిషి పక్షిలా పైకెగరాలనుకోవడం, ఎగరగలిగిన వ్యక్తి భూమిపై నడవాలనుకోవడం ఒక పారడాక్స్. ‘అతడు-నేను-లోయ చివరి రహస్యం” (భగవంతం) దాన్ని దృశ్యీకరించింది. కొలతలు, లెక్కల ప్రయాణంలో గడియారం ముల్లులా బతికే మనిషితో నాలుగు రోజులు గడిపితే పిచ్చెక్కిపోతుంది. స్పందనా రహిత మరమనిషతో స్నేహం ఆత్మహత్యాసదృశం. ఇలాంటి వాతావరణంలోని కళాకారుడు జీవితాన్ని రద్దు చేసుకుందామని బయల్దేరడం ”మంచు” కథలో (మూలా సుబ్రహ్మణ్యం) కనిపిస్తుంది. సృష్టిలో ప్రతిదీ దేవుని చర్యే. నిస్సహయులపై దౌర్జన్యంచేయడం కూడా దేవుని చర్యే.
అలాంటి దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న ఒక్క పలచని వాడు ”దేవుణ్ణి అటకాయించిన మనిషి” (మెహర్) మధ్యాహ్న భోజన నేపథ్యంగా సాగిన కథ జీవగంజి. (పూడూరి రాజిరెడ్డి) ఫీల్ అవడం బట్టి చర్య ఉంటుందనేది కథ చెప్పిన సత్యం. ఏక కాలంలో గత వర్తమానాల్లో ఈ కథ సాగింది. సమూహంలో ఉంటూ ఒంటరితనాన్ని ప్రేమిస్తూ ”నేను కాని నేను” లా జీవిస్తూ ”విషాద ఏకాంతం” (కాశీభట్ల) కథ సాగింది. జ్ఞాపకాలు పొరలు పొరలుగా విచ్చుకుంటూ కథగా కుదిరి ”గాలిపొరలు”గా (బి.అజయ్ ప్రసాద్) విస్తరించింది. మెలకువ, భ్రాంతిల మధ్య తలపులు పెనవేసుకున్న తీరు ఆసక్తిగా ఉంది.
ఫార్మల్ కథలకు భిన్నంగా కనిపించే కథలివి. రచయితల ఆసక్తులు, చింతనల వల్ల కథలు అలా కుదిరాయి. చెలియలికట్ట దాటిన అలలు, రిక్టర్ స్కేల్‌కు అందని కంపనలు, లిట్మస్ టెస్ట్‌కు లొంగని రంగులు కథల్లో కనబడతాయి. పదాలు-ప్రశ్నలు, వాక్యాలు-వ్యంగ్యాలు, అక్షరాలు-అర్థాలు రొమ్ము విరుచుకొని విజృంభిస్తాయి. కథల్లోని కొత్త వాతావరణం కనువిందు చేస్తుంది. శృంగారం-సెక్స్, అసహనం-అందం. భ్రాంతి-వాస్తవం ముప్పేటలా అల్లుకొని పాఠకుణ్ణి ఆలోచింపజేస్తాయి. పట్టి కుదుపుతాయి.
”దయ్యాలు, పుష్పవర్ణమాసంలో పుట్టిన వాళ్ళకి కనపడతాయి”
”చినుకు చుంబించిన నేల పరిమళంలా వున్నావ్”
”నీ ప్రేయసి అభ్యంగన ఇరుల కురుల ఇరుకుల్లో చిక్కుబడ్డ సాంబ్రాణీ పొగల నడుగు, ఒకే ఒక్క రేకుగా మిగిలిన రాతిరి పారిజాతాన్నడుగు”
ఇలాంటి వాక్యాల పక్కన పాఠకుడు ఒక నిమిషమైనా నిలబడతాడు. ఒకే చోట నవరసాల రంగుల్ని సృష్టించి, పాఠకుణ్ణి అందులో నిలబెట్టింది ”అపురూప”.
డా||బి.వి.ఎన్.స్వామి, 9247817732.


