Monday, September 22, 2025
E-PAPER
Homeదర్వాజతొలిసారి స్ఫూర్తిగా నిలిచిన కథలు

తొలిసారి స్ఫూర్తిగా నిలిచిన కథలు

- Advertisement -

నేను మహబూబ్‌ నగర్‌ లోని యం.వి.యస్‌. కాలేజిలో డిగ్రీ చదివే రోజుల్లో చిన్న చిన్నగా ప్రేమ కవితలు రాస్తూ ఉండేవాడిని. వాటిని చదివిన ఫ్రెండ్స్‌ పొగుడుతుంటే మురిసిపోయేవాడిని. అప్పటికే షార్ట్‌ ఫిల్మ్స్‌ తీయడానికి నాకు తెలిసిన పద్ధతిలో కథలు కూడా రాసుకునేవాడిని. అలా మెల్లమెల్లగా నా రచన వ్యాసంగం మొదలైంది. 2012లో నేను రాసిన లవ్‌ ఫెయిల్యూర్‌ సాంగ్‌ ”నా ప్రాణం నువ్వేగా” 2013 కాలేజి ఫంక్షన్‌ లో అప్పటి మా జిల్లా అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌ గారు, మా కళాశాల ప్రిన్సిపాల్‌ జి.యాదగిరి గారు, ఇతర అధ్యాపక బృందంచేత ఆడియో రిలీజ్‌ చేయడం జరిగింది. అక్కడ ఆరోజు నేను రాసిన పాటను విన్న ప్రతి ఒక్కరూ నా దగ్గరకొచ్చి అభినందిస్తుంటే చాలా ఆనందమేసింది. నేను కూడా పాటలు రాయగలను అని ఇతరులతోపాటూ నాకూ నమ్మకాన్ని ఇచ్చిన రోజది. అదే సంవత్సరం నేను రాసిన కొన్ని ప్రేమ కవితలు మా కాలేజి మ్యాగజైన్‌ లో అచ్చు అయ్యాయి. తొలిసారి నా రచనలను ప్రింటింగ్‌ రూపంలో చూసుకొని ఆనందపడుతున్న క్షణంలో ”ఒరేయ్‌ నువ్విలా అమ్మాయిల ప్రేమ గురించి రాస్తే ఇకేమి లాభం ఉండదు. సమాజాన్ని ప్రేమించు, సమాజం గురించి ఆలోచించి రాయి.

అప్పుడు నీకంటూ ఓ గుర్తింపు ఉంటుంది” అని ప్రేమతో హెచ్చరించి చెప్పారు మా ఇంగ్లీష్‌ లెక్చరర్‌ హరినాథ్‌ సార్‌. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఫైనల్‌ స్టేజ్‌ లో ఉంది. రోజూ న్యూస్‌ పేపర్‌ చదివే అలవాటు ఉండటం వల్ల, అందులో వచ్చే ఉద్యమ కవిత్వం చదవడం వల్ల, ఆ సాహిత్యంపట్ల ఆకర్షితుడినై తొందరగానే ఆ ట్య్రాక్‌లో పడిపోయిన. మళ్ళీ నేను రాస్తున్నది అసలు కవిత్వమేనా కాదా అని నాకే డౌట్‌ వచ్చింది. ఎందుకంటే అప్పటివరకు నేను అప్పుడప్పుడు పేపర్‌లో వచ్చిన కవిత్వం, మా కాలేజిలో ఉండే జూవాలజి లెక్చరర్‌ లింగాకారి మహేష్‌ సార్‌ తెలుగుతల్లికి వ్యతిరేకంగా రాసిన ”నువ్‌ నా తల్లివి కావ్‌” అనే కవితా సంపుటి తప్పా ఏ ఇతర పుస్తకం చదివింది లేదు. ఆ క్రమంలో మళ్ళీ హరినాథ్‌ సార్‌ కు చూపించడం జరిగింది. సార్‌ వాటిని చదివి ”ఒకసారి తెలుగు డిపార్ట్మెంట్‌ లో ఎన్‌. సుభాషిణి మేడంను కలువు. అంతా మేడం చూస్కుంటుంది” అని చెప్తే పోయి కలిసిన. సుభాషిణి మేడం చూసి ”పర్లేదు. బానే రాస్తున్నవ్‌. నీక్కొంచెం సాన బెట్టాలే. ఇంకా బాగా రాయగలవు. జడ్చెర్లలో మా గురువు, సీనియర్‌ కవి, కథా రచయిత ఉదయమిత్ర గారుంటారు. వారికి నేన్నీ గురించి చెప్తాను. పోయి కలువు” అని చెప్పి ప్రోత్సాహిస్తే మరుసటిరోజే ఫోన్‌ చేస్తూ అడ్రస్‌ తెలుసుకుంటూ పోయి కలిసిన.

వ్యక్తిగత విషయాలు, సాహిత్య అంశాలు చాలా బాగా చెప్పారు ఉదయమిత్ర సార్‌ ఓ మిత్రుడిలా కూర్చోబెట్టుకొని. అన్నీ విషయాలు చెప్పిన తర్వాత నేనక్కడి నుంచి వచ్చేటప్పుడు వారు రాసిన కవిత్వ పుస్తకాలు, కథల పుస్తకాలు ఇచ్చారు. తీస్కోని ఇంటికొచ్చిన. అందులో నన్ను బాగా కదిలించిన కథలు అమ్మను జూడాలె, ఆఖరి కుందేలు. ఇవి రెండూ రెండు పుస్తకాల పేర్లే. ఈ రెండు పుస్తకాల్లో ముప్పై కథలు ఉండొచ్చు. వాటిని మొత్తం చదివేసిన. వాటిని చదివిన ప్రతీసారి ఏదో తెలియని భావోద్వేగం అలుముకునేది. సమాజంలో ఉన్న అసమానతలు, వివక్షలు, ప్రపంచీకరణ వలలో చిక్కి భారత గ్రామీణ వ్యవస్థ ఎలా చిన్నాబిన్నం అవుతున్నాయో అన్నీ అందులో ఉన్నాయి. సెజ్‌ ల పేరుతో రైతులను కూలీలుగా మార్చిన దైన్య స్థితిని ఆఖరి కుందేలు కథలో చాలా బాగా చెప్పారు. ఆఖరికి సెజ్‌ రూపంలో భూమి కోల్పోయిన రైతు అక్కడే గుప్పిట నిండా తనకు అన్నం పెట్టిన మట్టిని పట్టుకొని ప్రాణం వదిలిన సంఘట చదివితే పాఠకుడు తప్పకుండ కన్నీళ్లు పెడతాడు. కంపెనీల వ్యర్థాలు కలిసిన నీటిని తాగిన కుందేలు కూడా మరణిస్తుంది. ఈ కథలు చదివిన వారు చలించకుండా ఉండలేరు. అంతబాగా రాశారు. ఆ కథలు చదివినప్పటి నుండి నేనూ సామాజిక కోణంలో కథలు రాయాలని బలంగా అనిపించేది. అలా అలా చిన్నగా కథలు రాయడం మొదలుపెట్టిన. నేను చూస్తూ గమనిస్తున్న సమాజాన్ని నాదైన కోణంలో కథలు రాయడానికి తొలిసారి స్ఫూర్తిగా నిలిచిన కథలు మాత్రం ఉదయమిత్ర గారు రాసినవే.

  • కెపి.లక్ష్మీనరసింహ, 9010645470
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -