నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వీధి కుక్కల దాడులను నివారించి, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్ధక శాఖ సంబంధిత అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వీధి కుక్కల బెడద అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంతాల్లో కుక్కలను బంధించడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
కుక్కకాటు ద్వారా వ్యాపించే రేబిస్ వ్యాధిని నివారించేందుకు వీధి కుక్కలను గుర్తించి, వాటికి యాంటీ రేబిస్ టీకాలు వేయాలని స్పష్టం చేశారు. అలాగే కుక్కల జనాభాను నియంత్రించేందుకు పెద్దఎత్తున స్టెరిలైజేషన్ (జనన నియంత్రణ) ఆపరేషన్లు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు, ఆర్టీసీ బస్టాండ్‌లు వంటి ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో ఉన్న కుక్కలను వెంటనే నియంత్రించాలని పేర్కొన్నారు. స్టెరిలైజేషన్ అనంతరం కుక్కలను తగిన షెల్టర్లలో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.జాతీయ రహదారులపై వీధి కుక్కలు మరియు ఇతర జంతువులు సంచరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మున్సిపాలిటీలు,గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రుల వద్ద కుక్కలను గుర్తించి, వాటికి స్టెరిలైజేషన్ చర్యలు చేపట్టాలని తెలిపారు. స్టెరిలైజేషన్, రేబిస్ టీకా డ్రైవ్ ను క్రమం తప్పకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పశు సమర్థక శాఖ వైద్యులు,మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల వీధి కుక్కల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు చెత్త సేకరణను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ.. జిల్లాలో వీధి కుక్కలను గుర్తించి వాటికి స్టెరిలైజేషన్ చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా జనాభా ఎక్కువ ఉండే చోట క్రమం తప్పకుండా డ్రైవ్ నిర్వహించి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయాలన్నారు.అలాగే కుక్కలు రోడ్లపై తిరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.రోడ్ల పై తిరిగే జంతువులను, కుక్కలను తరచూ పెట్రోలింగ్ చేస్తూ గుర్తించి ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ అధికారి సరిత, పశుసంవర్ధక శాఖ అధికారి జానయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా వైద్యశాఖ అధికారి మనోహర్, జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణ, మున్సిపల్ కమిషనర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



