Friday, November 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅడ్డదిడ్డ 'సమాచారం'

అడ్డదిడ్డ ‘సమాచారం’

- Advertisement -

సమాచారమివ్వకుండా ఫలానా ఆఫీసర్లు ఇస్తారని ప్రత్యుత్తరం
తప్పించుకునే ధోరణితో తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ యంత్రాంగం
ఆర్టీఐ యాక్ట్‌ కింద వచ్చిన దరఖాస్తుల వివరాలివ్వటంలో నిర్లక్ష్యం
కమిషన్‌ జరిమానాలు విధిస్తున్నా మారని అధికారుల తీరు


నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీ కోసం తీసుకొచ్చిన సమాచార హక్కుచట్టం(2005) కొంతకాలంగా నిర్లక్ష్యానికి లోనవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం లోపించటంతో ఈ చట్టం విషయంలో సాధికారత లోపిస్తోంది. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్‌ నుంచి రావాల్సిన సమాచారంలో సమగ్రత లోపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రధానాచార్యుల ఫోన్‌ నంబర్లు ఇచ్చి వారి నుంచి సమాచారం తీసుకోవాల్సిందిగా సూచించింది. దాదాపు తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 30వేలకు పైగా ఆర్టీఐ దరఖాస్తులు ఏండ్ల తరబడి ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా పెండింగ్‌లో ఉన్నాయని ఓ సర్వే సంస్థ అంచనా.

ఆర్టీఐ నిబంధనల ప్రకారం అడిగిన సమాచారం సంబంధిత అధికారుల వద్ద లేనప్పుడు ఎక్కడ ఉంటుందో.. ఆ దరఖాస్తును సంబంధిత కార్యాలయానికి పంపించాలి. సమాచారం తెప్పించుకొని ఇవ్వటం లేదంటే ఆ అప్పిలేట్‌ అధికారినే సంబంధిత దరఖాస్తులో కోరిన సమాచారం అప్లికెన్ట్‌కు పంపించాల్సిందిగా సూచించాలి. కానీ అలాంటిదేమీ లేకుండా గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు ఆ అధికారుల ఫోన్‌ నంబర్లు ఇచ్చి చేతులు దులుపుకోవటం నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఆర్టీఐ యాక్టివిస్టు లు పేర్కొంటున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఆర్టీఐ కమిషనర్‌కు దరఖాస్తు చేయాలని సూచిస్తున్నారు.

అధికారుల ఫోన్‌నంబర్లు ఇచ్చేందుకు నెల రోజులా..?!
ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాకు చెందిన పి.సబిత ఆర్టీఐ యాక్ట్‌ కింద ఓ సమాచారం నిమిత్తమై తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్‌కు ఫిబ్రవరి 2025లో దరఖాస్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 2024 నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఆర్టీఐ ద్వారా వచ్చిన అప్లికేషన్‌ల వివరాలు అడిగారు. దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? ఎవరి వద్ద నుంచి వచ్చాయి? ఎన్ని అప్లికేషన్‌లకు సమాచారం ఇచ్చారు? ఎన్నింటికి ఇవ్వలేదు? సమాచారం ఇవ్వకపోవడానికి కారణాలు, ఇవ్వని వాటి విషయంలో తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు.

దానికి ఓ నెలరోజుల తర్వాత సరిగ్గా మార్చి 15వ తేదీన అధికారులు జవాబు ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు తెలంగాణ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏన్కూరు, వైరా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రధానా చార్యుల (ప్రాంతీయ సహాయ సమాచార అధికారులు) పేర్లు, వారి ఫోన్‌ నంబర్లు ఇచ్చి.. వారి ద్వారా సమాచారం పొందొచ్చని దరఖాస్తుదారుకు ప్రత్యుత్తరం పంపారు. పౌరసమాచార హక్కు చట్టం, 2005ను అనుసరించి7(1) ద్వారా దరఖాస్తును తొలగించినట్టు దానిలో పేర్కొన్నారు.

జరిమానా విధిస్తున్నా మారని తీరు
సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉన్నతాధికారులకు ఆర్టీఐ కమిషన్‌ జరిమానా విధిస్తున్నా ఆయా శాఖల్లో ఎలాంటి మార్పూ రావటం లేదు. ఆర్టీఐ కింద అడిగిన సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు రాష్ట్ర సమాచార శాఖ కమిషన్‌ వారం రోజుల కిందట జరిమానా విధించింది. నీటిపారుదల ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని ఎన్‌.జంగయ్య 2024 ఫిబ్రవరి 24న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ కార్యాల యంలో ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. ఏడాది దాటినా ఇవ్వకపోవడంతో ఆయన కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై కమిషన్‌ సంబంధిత డీఈఈకి షోకాజ్‌ నోటీసు పంపింది.

స్వయంగా హాజరు కావాలని సూచించినా ఆయన గైర్హాజరయ్యారు. దాంతో ఆర్టీఐ కమిష నర్‌ సదరు డీఈఈకి రూ.5వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. 2022 జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న సమాచారం ఇవ్వక పోవడంతో దరఖాస్తుదారు ఆర్టీఐ స్టేట్‌ కమిషనర్‌ పివీ శ్రీనివాస రావును ఆశ్రయిం చారు. దీనిపై జగిత్యాల మున్సి పాల్టీ పీఆర్వోకు రూ.2వేల జరిమానా పడింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి జరి మానాల పరంపర మొదలైన నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులు ఆర్టీఐ కింద అడి గిన సమాచారం ఇవ్వటంలో నిర్లక్ష్యం వీడా ల్సిన అవసరం ఉందని యాక్టివిస్టులు అంటున్నారు.

సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి.. రెంటల నారాయణరావు, ఆర్టీఐ తెలంగాణ వికాస సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షులు
ఆర్టీఐ కింద అడిగిన సమాచారం ఇవ్వకపోవటం, అడ్డదిడ్డంగా ఇచ్చి చేతులు దులుపుకోవటం, లేదంటే రోజుల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టడం.. ఆయా శాఖల్లో సర్వసాధారణంగా మారింది. ఈ నిర్లక్ష్య ధోరణిని రూపుమాపాలి. ఆర్టీఐ చట్టం పారదర్శకంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో వెంటనే చర్యలు తీసుకోకపోతే అధికారుల్లో జవాబుదారీతనం లోపిస్తుంది. నేను ఖమ్మం కార్పొరేషన్‌ భూముల లీజు విషయమై చేసిన ఆర్టీఐ దరఖాస్తు ఏడాదిగా పెండింగ్‌లో ఉంది. కమిషనర్‌కు దీనిపై ఫిర్యాదు చేశాను. ఇలా అనేకం పెండింగ్‌లో ఉంటున్నా చర్యలు సీరియస్‌గా ఉండటం లేదు.

కొనసాగుతున్న నిర్లక్ష్యం
ఆర్టీఐ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనసాగు తున్న నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం మాత్రమే. ఇదే దరఖాస్తుదారు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి సమాచారం అడగడానికి ముందు సరిగ్గా ఏడాది కిందట బూర్గంపాడు తెలంగాణ గురుకుల పాఠశాల, కళా శాల ప్రిన్సిపాల్‌కు ఆర్టీఐ కింద పైన ఉటంకించిన అంశాల పైనే వివరాలు అడిగారు. కానీ ఏడాదైనా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో సంబంధిత అప్లికెన్ట్‌ సబిత ఉన్నతాధికారులను కోరారు. కానీ అక్కడి నుంచి కూడా అవే అధికారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ఇవ్వటం గమనార్హం. కోరిన సమాచారం అత్యంత చిన్న విషయమైనా అధికారుల నుంచి ఆశించిన స్పందన లేకపోవడం ప్రభుత్వ శాఖల్లో ఆర్టీఐ విషయంలో ఎంతటి నిర్లక్ష్యం ఉందో తెలియజేస్తోందని ఆర్టీఐ తెలంగాణ వికాస సమితి పేర్కొంది. దాదాపు తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 30 వేలకు పైగా ఆర్టీఐ దరఖాస్తులు ఏండ్ల తరబడి ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా పెండింగ్‌లో ఉన్నాయని ఓ సర్వే సంస్థ అంచనా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -