ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
నవతెలంగాణ – సదాశివపేట
సదాశివపేట మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని చేపడుతున్న ఈ పనులు స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడంలో కీలకంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు.
మండలంలోని ముబారక్పూర్ (ఏ), వెల్టూర్, కోనాపూర్, నాగ్సన్పల్లి గ్రామాల్లో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ముబారక్పూర్ (ఏ) గ్రామానికి రూ.7 లక్షలు, వెల్టూర్ గ్రామానికి రూ.8 లక్షలు, కోనాపూర్ గ్రామానికి రూ.8 లక్షలు, నాగసాన్పల్లి గ్రామానికి రూ.6 లక్షల నిధులను ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయించారు. ఈ పనులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్ల సమస్యలు పరిష్కారమైతే ప్రజల దైనందిన జీవన విధానం సులభమవుతుందని పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం వల్ల వర్షాకాలంలో మట్టి రోడ్ల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. గ్రామీణాభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని చెప్పారు. అయితే గత 26 నెలలుగా గ్రామాలకు తగిన నిధులు అందకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు మందగించాయని ఆయన విమర్శించారు.ప్రస్తుత0 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఫలాలు అందించడంలో విఫలమైందని అన్నారు. వారి దృష్టి ప్రజా సమస్యల పరిష్కారంపై కాకుండా ఢిల్లీకి మూటలు పంపడంపైనే ఉందని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయి కేంద్రం నుంచి పలు అవార్డులు సాధించిందని గుర్తు చేశారు.
కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న విధానాల వల్ల ఆ అభివృద్ధి క్రమంగా తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్ద గొల్ల ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల సుధీర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, ఏఈ కోటేశ్వరరావు, ముబారక్ పూర్ (ఏ) సర్పంచ్ నవీన్ కుమార్, వెల్టూర్ సర్పంచ్ తొంట కిష్టయ్య, కోనాపూర్ సర్పంచ్ అనిల్ రెడ్డి, నాగసాన్పల్లి సర్పంచ్ కాశీపురం రవికుమార్, మాజీ సర్పంచులు చంద్రశేఖర్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, కుమార్, నాయకులు శంభు, హుస్సేన్, శివకుమార్, రాందాస్, పండరి, ఆంజనేయులు, జాఫర్, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.



