స్థానిక సమస్యలపై సమరశీల పోరాటాలు ఉండాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ
జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా నాయకులకు రాష్ట్ర కార్యదర్శి ఆదేశం
నవతెలంగాణ – వనపర్తి
ప్రజా పోరాటాలతోనే రాష్ట్రంలో జిల్లాలలో గ్రామీణ స్థాయిలోని సీపీఐ(ఎం) పార్టీని బలోపేతం చేసుకోగలమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం రాజనగరం పరిధిలోని విక్టోరియా బ్లాంకెట్ హాలు లో డి.బాల్ రెడ్డి అధ్యక్షతన సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొని ప్రసంగించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు జిల్లా కర్తవ్యాలను వివరించారు.
ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించాయని, ప్రజల పార్టీగా సీపీఐ(ఎం) ప్రజల పక్షాన నిలబడి స్థానిక సమస్యలపై సమరం చేయాల్సిన అవసరం ఏర్పడిందని జిల్లా నాయకులకు సూచించారు. కేంద్రంలో బిజెపిిి ప్రభుత్వం మరో మారు అధికారంలోకి వచ్చాక చట్టసభల్లో సంఖ్యాబలం ఉందన్న నెపంతో కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోట్లను తెచ్చిందని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వి బి జి రాంజీ బిల్లును తీసుకొచ్చిందని దానివల్ల దేశంలోని 30 కోట్ల నిరుపేద కూలీలకు నష్టం వాటిలనుందని తెలిపారు.
ఉపాధి హామీ చట్టాన్ని కాపాడేందుకు మునుముందు కూలీలతో కలిసి ప్రజా ఉద్యమాలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. దేశంలో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన పలు చట్టాలు ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా, ప్రజలపై భారం మోపేలా, ఉపాధి అవకాశాలను కోల్పోయేలా ఉన్నాయని పలు అంశాలను వివరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రెండున్నర ఏళ్ళు కావస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా వెనుకబడిందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కొంత మహిళా ప్రాణ ప్రయాణికులకు ఊరట కల్పించినా, తగినన్ని బస్సులను ప్రభుత్వం రవాణాకు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మహిళలకు, విద్యార్థులకు, రైతులకు, ఉపాధ్యాయ రంగాలకు, ఉద్యోగస్తులకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందని తెలిపారు. ప్రజల అభీష్టం మేరకు ప్రజాపాలన ఉండాలని, అందుకు విరుద్ధంగా పాలన కొనసాగడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు తో పాటు పెన్షన్లు ఇతర పథకాలను సక్రమంగా లబ్ధిదారులందరికీ అందేలా ప్రభుత్వం కృషి చేయాలని, బాధితుల పక్షాన సీపీఐ(ఎం) ప్రజా ఉద్యమాలను నిర్వహించబోతుందని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయడంపై గ్రామీణ ప్రాంతాలపై పట్టు కలిగి ఉండాలని నాయకులకు సూచించారు.
స్థానికంగా నెలకొన్న భూ సమస్యలు, లబ్ధిదారులకు ఇండ్లు, వృద్ధులు వితంతువులకు పెన్షన్లు, తాగునీరు సాగునీరు వంటి అంశాలపై సీపీఐ(ఎం) నాయకులు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహనతో ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పట్టుకున్న ఏ పార్టీకైనా ప్రజలు అండదండగా ఉంటారని, ప్రజలకు అండగా నిలవడంలో సీపీఐ(ఎం) ఎప్పుడు ముందుండాలని నాయకులకు హితబోధ చేశారు.
ఇటీవల కాలంలో దేశంలో రాష్ట్రంలో విపరీతమైన కుల అసమానతలతో కూడిన దాడులు పెరుగుతున్నాయని, వాటిని సీపీఐ(ఎం) ఖండిస్తుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జాతర సందర్భంగా అగ్రవర్ణాల పెత్తందారులు గ్రామానికి చెందిన ఒక కుటుంబం పై దాడి చేసి రెండు నెలల పసికందును హత్య చేశారని, ఈ ఘటనలో రాజకీయ జోథ్యం లేకుండా దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు నమోదు చేయడంతో పాటు అత్యంత కఠినమైన సెక్షన్లను విధించి దుర్మార్గులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం పాలకవర్గాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్ గ్యారంటీలు ఉన్నాయని వాటిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి జబ్బార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రాజు, జిల్లాకమిటీ సభ్యులు జి వెంకటయ్య బాల్య నాయక్ వెంకట్ రాములు మేకల ఆంజనేయులు మహబూబ్ పాషా వెంకటేష్ పరమేశ్వర చారి ఎం కృష్ణయ్య ఎస్ రాజు రేమద్దుల సీపీఐ(ఎం) గ్రామ సర్పంచ్ నిరంజన్ పిల్లరాల్లపల్లి తెల్ల రాళ్లపల్లి సీపీఐ(ఎం) గ్రామ సర్పంచ్ జంబులయ్య సీపీఐ(ఎం) వనపర్తి 18 వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్, మండల, శాఖా కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.



