– ఉన్నత విద్యా సంస్థల్లో మానసిక ఆరోగ్య సదుపాయాల లోపం
– పేరుకే సహాయ వ్యవస్థలు
– సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ నివేదిక
న్యూఢిల్లీ : విద్యార్థుల్లో పెరుగుతున్న విద్యా ఒత్తిడి, ఉన్న విద్యా సంస్థల్లో సరైన మానసిక ఆరోగ్య సదుపాయలు లేకపోవడమే విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్‌ఫోర్స్ (ఎన్‌టీఎఫ్) స్పష్టం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు నియమించిన ఎన్‌టీఎఫ్ 2025లో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు 12.8 లక్షల మంది విద్యార్థులు, 1.6 లక్షల మంది అధ్యాపకులు, 2.26 లక్షల మంది తల్లిదండ్రులు, 16,750 ఉన్నత విద్యా సంస్థలు పాల్గొన్నాయి. ఈ నివేదిక సమాచారం ప్రకారం… 15-29 ఏండ్ల వయసు గలవారిలో పురుషులకు ఆత్మహత్య రెండో పెద్ద మరణ కారణం కాగా.. మహిళలకు ఇది మొదటి కారణంగా ఉన్నది. 2022లో సుమారు 13 వేల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డేటా వెల్లడించింది. ఐఐటీల్లో గత 30 నెలల్లోనే 40 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, వికలాంగులు, మహిళలు, ఇంగ్లీష్ మాట్లాడనివారు, గ్రామీణ నేపథ్యం కలిగిన విద్యార్థులు కళాశాలల్లో ప్రత్యేకంగా వెనుకబడిన వర్గంగా ఉన్నారు. వీరి కోసం ఏర్పాటు చేయాల్సిన ఈక్వల్ ఆపర్చునుటీ సెల్స్ (ఈఓసీలు), ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు(ఐసీసీలు) చాలా చోట్ల కాగితాలకే పరిమితమయ్యాయని టాస్క్‌ఫోర్స్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ కమిటీలకు స్వతంత్రత లేకపోవడం, నిందితులకే మద్దతు ఇవ్వడం వల్ల విద్యార్థులు విద్యార్థులు ఫిర్యాదులు చేయడానికి భయపడుతున్నారని పేర్కొన్నది. బాండింగ్, ఫ్రెండ్లీ పరిచయం పేరుతో ర్యాగింగ్ కొనసాగుతోందనీ, దానిపై చర్యలు ఆశించినంతగా లేవని వివరించింది.
విద్యార్థులు అధిక విద్యా ఒత్తిడి, కఠిన హాజరు నిబంధనలు, సరిగ్గా ప్రణాళిక చేయని పాఠ్య ప్రణాళిక, అధ్యాపకుల కొరత, అనుభవం లేని గెస్ట్ ఫ్యాకల్టీపై ఆధారపడటం, స్పష్టత లేని ప్లేస్‌మెంట్ విధానాలపై ఫిర్యాదులు చేశారు. పీహెచ్‌డీ విద్యార్థులు పరిశోధన ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, గైడ్‌లతో సంబంధాలలో అసమానతలు, ల్యాబ్ సదుపాయాల లోపంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనతువున్నారు. సుమారు 65 శాతం సంస్థల్లో క్యాంపస్‌లో మానసిక ఆరోగ్య నిపుణులే లేరని సర్వేలో వెల్లడైంది. ఈ నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు విద్యార్థులకు సురక్షితమైన, సమాన మైన, స్పందన కలిగిన క్యాంపస్‌లు కల్పించడం రాజ్యాంగ బద్ధమైన బాధ్యత అని స్పష్టం చేసింది. టాస్క్‌ఫోర్స్ పదవీకాలాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ.. మానసిక ఆరోగ్య సేవల కోసం మార్గదర్శకాలు (ఎస్‌ఓపీలు) రూపొందించాలని ఆదేశించింది.
విద్యార్థి ఆత్మహత్యలకు ఒత్తిడే ప్రధాన కారణం
- Advertisement -
- Advertisement -



