స్త్రీనిధి కార్యకలాపాలపై మంత్రి సీతక్క సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్త్రీనిధి కార్యకలాపాల్లో నిధుల దుర్వినియోగం, అవినీతి, అక్రమాలు జరిగినట్టు తేలితే బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో స్త్రీనిధి కార్యకలాపాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీనిధి సంస్థ పేద మహిళలకు ఆర్థిక అండగా నిలుస్తూ వేలాది కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరుస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తున్నదని ఆమె అన్నారు. స్త్రీనిధి సంస్థపై తప్పుడు ప్రచారాలు జరిగితే వాటిని తక్షణమే ఖండిస్తూ సరైన సమాచారం ప్రజలకు అందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ”గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో స్త్రీనిధి ద్వారా రూ.1,947 కోట్ల రుణాలు పంపిణీ చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటికే రూ.2,064 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు అందించాం. తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ రుణ ప్రణాళికలో దాదాపు 90 శాతం లక్ష్యాన్ని సాధించాం. గత సంవత్సరం 78 శాతం రికవరీ సాధించగా, ప్రస్తుత సంవత్సరం 72 శాతం రికవరీ నమోదైందనీ, సెర్ప్, మెప్మా సిబ్బంది సమన్వయంతో 85 శాతం రికవరీ లక్ష్యంతో క్షేత్రస్థాయిలో చర్యలు కొనసాగుతుయి” అని వివరించారు. స్త్రీనిధి స్థాపన నుంచి ఇప్పటివరకు పారదర్శకంగా పనిచేస్తున్నందున అనేక బ్యాంకులు సంస్థకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని వారు తెలిపారు. గతంలో అవకతవకలకు పాల్పడిన 16 మంది సిబ్బందిని తొలగించినట్టు వెల్లడించారు. సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం 163 మంది సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అలాగే సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రగతి ఆధారిత ప్రోత్సాహకాలు (పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్) ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించినట్టు వివరించారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిధులు దుర్వినియోగమైతే కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



