డిఫాల్టర్లకు ధాన్యం కేటాయింపులుండవు
ఆర్థిక వ్యవస్థ బాగుపడితే రేషన్‌షాపుల్లో మిగిలిన సరుకులు సరఫరా
ధాన్యం దిగుబడిలోనే కాదు… కొనుగోళ్లలోనూ రికార్డు : పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
రైస్ మిల్లర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులుండవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించిన మిల్లర్లకు సంపూర్ణ సహాయ, సహకారాలు ఉంటాయని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అంతకు ముందు సంబంధిత ఉన్నతాధికారులతో రబీ సీజన్ ధాన్యం సేకరణపై మంత్రి సమీక్షించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలను అమలు చేయడంలో సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికనుగుణంగా ఎగుమతులను ప్రోత్సహించాలని కోరారు. అందుకు సంబంధించిన విధి, విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిన తర్వాత రేషన్‌షాపుల్లో బియ్యంతోపాటు ఇతర నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో డ్రైయర్లు, పాడి క్లినర్ల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ధాన్యం దిగుబడిలోనే కాకుండా కొనుగోళ్లలోనూ రాష్ట్రం దేశంలోనే రికార్డు సృష్టించిందని తెలిపారు. గడిచిన 25 ఏండ్ల వ్యవధిలో ఇదే అత్యధిక రికార్డు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల వ్యవదిలో అనుసరించిన విధానాల ఫలితమే ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు. పౌరసరఫరాల, నీటిపారుదల, వ్యవసాయ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవడంతోపాటు రైతాంగం భాగస్వామ్యంతోటే ఇంతటి విజయం సాధించామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ధాన్యాన్ని పండించేందుకు రైతులను ప్రోత్సహిస్తామన్నారు. బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ధాన్యం కొనుగోళ్ల పక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 38,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. అందుకు రూ. 13,650 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఉన్న నాణ్యతా లోపాలను గుర్తించడంతోపాటు అక్రమంగా బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలి పద్దతికి చెక్ పెడతామని మంత్రి ఈసందర్భంగా చెప్పారు.



