Sunday, May 25, 2025
Homeప్రధాన వార్తలుకోవిడ్‌, డెంగీ పేరుతో దోపిడీ చేస్తే కఠిన చర్యలు

కోవిడ్‌, డెంగీ పేరుతో దోపిడీ చేస్తే కఠిన చర్యలు

- Advertisement -

మంత్రి దామోదర రాజనర్సింహ
కరోనా వ్యాప్తి, సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై ఉన్నతాధికారులతో సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కోవిడ్‌, డెంగీ వ్యాధుల పేరుతో ప్రజలను ఆందోళనకు గురిచేసి, దోచుకునేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా భారతదేశం, విదేశాల్లో ఉన్న కోవిడ్‌ పరిస్థితులను అధికారులు, ఎపిడమాలజిస్టు లు మంత్రికి వివరించారు. కొన్ని దేశాల్లో కోవిడ్‌ కేసులు స్పల్పంగా పెరిగినప్పటికీ, హాస్పిటలైజేషన్‌ చాలా తక్కువగా ఉందని తెలిపారు. ఇండియాలో పరిస్థితి సాధారణంగా ఉందని, జేఎన్‌ 1 వేరియంట్‌ కేసులు కొన్ని నమోదయ్యాయనీ, ఈ వేరియంట్‌ 2023 నుంచే ఇండియాలో వ్యాప్తిలో ఉందని వివరించారు. ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులేమీ లేవని చెప్పారు. ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి తప్పితే, ఇతరులెవరికీ హాస్పిటలైజేషన్‌ అవసరం పడడం లేదని వెల్లడించారు.
కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి రాష్ట్రాలకు ఇప్పటి వరకూ అడ్వైజరీలు, గైడ్‌లైన్స్‌ ఏమీ రాలేదని అధికారులు మంత్రికి తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉండడం, ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చునని వారు అభిప్రాయపడ్డారు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే కోవిడ్‌ ఎండెమిక్‌ స్టేజ్‌లోకి వచ్చిందనీ, అప్పుడప్పుడు కేసులు నమోదు అవడం, తగ్గడం, పెరగడం సహజమేనని ఎపిడమాలజిస్టులు మంత్రికి వివరించారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థి తులతో ప్రజలు దగ్గు, జలుబు, జ్వరాలు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ నమోదయ్యే కోవిడ్‌ కేసులను మేనేజ్‌ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని అధికారులు మంత్రికి తెలిపారు. టెస్టింగ్‌ కిట్స్‌, మెడిసిన్‌ సహా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనించాలని వారికి సూచించారు. కరోనా, సీజనల్‌ డిసీజ్‌ల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కోవిడ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలను కోరారు. వర్షాకాలంలో సీజనల్‌ డిసీజ్‌ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జలుబు, దగ్గులాగే కోవిడ్‌ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందనీ, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దగ్గు, జలుబు ఉన్నప్పుడు మాస్క్‌ ధరిం చడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వైరస్‌లు వ్యాపించకుండా ఉంటాయన్నారు. నీటి నిల్వ ఉంటే దోమలు పెరిగి, వ్యాధులు వ్యాపించే ప్రమాదముంటుందనీ, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నివారణ, నియంత్రణపై పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, ఇతర శాఖలతో కలిసి పని చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, డీఎంఈ డాక్టర్‌ నరేంద్రకుమార్‌, డీహెచ్‌ డాక్టర్‌ రవిందర్‌ నాయక్‌, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజరుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -