Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంచికిత్స మధ్యలో రోగులను డిశ్చార్జి చేస్తే కఠిన చర్యలు

చికిత్స మధ్యలో రోగులను డిశ్చార్జి చేస్తే కఠిన చర్యలు

- Advertisement -

ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరిక

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆపరేషన్ల తర్వాత, చికిత్స మధ్యలో పేషెంట్లను డిశ్చార్జి చేస్తున్న ప్రయివేటు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, ఉన్నతాధికారులతో కలిసి హాస్పిటల్‌లో అందుతున్న సేవలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, ఇతర ప్రభుత్వాస్పత్రుల ఎమర్జన్సీ డిపార్ట్‌మెంట్ల నడుమ సమన్వయం ఉండాలని సూచించారు. ఒక ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు నిండినపుడు, పేషెంట్‌ను మరో ఆస్పత్రికి రిఫర్‌ చేసి అక్కడ అడ్మిట్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. పేషెంట్‌ను రిఫర్‌ చేయడానికి ముందే అవసరమైన ప్రాథమిక చికిత్స అందించి, స్టేబుల్‌ చేయాలని ఆదేశించారు. పేషెంట్‌ ఆస్పత్రి మార్పు సమయంలో అవసరాన్ని బట్టి అంబులెన్స్‌లో ఒక డాక్టర్‌ను పంపించాలని మంత్రి సూచించారు. పేషెంట్ల అడ్మిషన్‌, రిఫరల్‌ విషయంలో డ్యూటీ డాక్టర్లు, ఆర్‌ఎంఓలు నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
నిమ్స్‌ ఎమర్జన్సీకి నేరుగా వచ్చే పేషెంట్లకు, ప్రభుత్వాస్పత్రుల నుంచి రిఫరల్‌పై వచ్చే వారికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ప్రయివేటు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ నుంచి వచ్చే పేషెంట్ల విషయంలోనూ సానుభూతితో వ్యవహరించి చికిత్స అందించాలన్నారు. ఈ ఏడాది వందకుపైగా కిడ్నీ ఆపరేషన్లు చేసినందుకు నిమ్స్‌ డైరెక్టర్‌, డాక్టర్లు, సిబ్బందిని మంత్రి అభినందించారు.
అంతకుముందు డాక్టర్‌ బీరప్ప మాట్లాడుతూ ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 5.44 లక్షల మందికి వైద్యసేవలందించగా, అందులో సగం మంది ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ పథకాల పరిధిలోని వారున్నట్టు తెలిపారు. ప్రతి రోజు ఎమర్జెన్సీకి 80 నుంచి వంద మంది రోగులు వస్తున్నారనీ, ఇందులో సగం మందికిపైగా ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొంది, పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో నిమ్స్‌కి వస్తున్నారని ఆయన తెలిపారు. కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆపరేషన్లు చేసి పేషెంట్లు పూర్తిగా కోలుకోకముందే డిశ్చార్జ్‌ చేసి నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పంపిస్తున్నారని బీరప్ప వివరించారు. ఇలాంటి కేసులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమావేశంలో హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తూ, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ వాణి, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రాజారావు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad