- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్: యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో యాసంగి 2025–26 ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని సంబంధిత అధికారులకు కీలక దిశానిర్దేశాలు చేశారు.
ఈ సమావేశంలో రైస్ మిల్లర్లు, రవాణా, కాంట్రాక్టర్లు, పోలీస్ శాఖ అధికారులు మరియు ఇతర సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం లక్ష్యంగా నిర్ణయించబడింది అని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం ఐకేపీ , పీఏసీఎస్, మెప్మా, ఎఫ్‌పిఒ ఆధ్వర్యంలో మొత్తం 330 ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పిపిసిలు) ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ నెలాఖరు నాటికి అన్ని కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసి, వరి కోతలు ప్రారంభమయ్యే ప్రాంతాలకు అనుగుణంగా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు సులభంగా చేరుకునే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి గరిష్ట సౌలభ్యం కల్పించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, తాగునీటి సౌకర్యం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, విశ్రాంతి ఏర్పాట్లు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. అలాగే ప్రతి కేంద్రంలో మద్దతు ధరలు, కంట్రోల్ రూమ్ నెంబర్లు, సెంటర్ ఇన్‌చార్జ్‌ల వివరాలు మరియు రైతులకు అవసరమైన సూచనలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ అధికారులు పంట కోతల పురోగతిని సమీక్షిస్తూ, రైతులకు టోకెన్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం తరలింపు జరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. అకాల వర్షాల పరిస్థితులపై వాతావరణ శాఖ నుంచి నిరంతర సమాచారం అందించబడు తుందని, దానికి అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు , రైస్ మిల్లర్లు అప్రమత్తంగా వ్యవహరించి, ధాన్యం నాణ్యతను కాపాడుతూ, ఆలస్యం లేకుండా సకాలంలో మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకుని కొనుగోలు ప్రక్రియలో సహకరించాలని సూచించారు.
అలాగే, ధాన్యం కొనుగోలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రైతుల బ్యాంక్ ఖాతాల్లో 48 గంటల్లో చెల్లింపులు జమఅయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణా, కాంట్రాక్టర్లు తమ ఒప్పందాల ప్రకారం వాహనాలను సమయానికి అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. రవాణా శాఖ అధికారులు ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామారావు, జిల్లా పౌరసరఫరాల అధికారి మోహనబాబు, జిల్లా మేనేజర్ (సివిల్ సప్లైస్) రాము, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీమతి శిరీష, డిసిఓ ప్రవీణ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, రవాణా శాఖ అధికారి, లీగల్ మెట్రాలజీ అధికారి, ఏసీపీలు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.



