సన్నాహక సమావేశంలో కలెక్టర్ దిశానిర్దేశం
మోడల్ కొనుగోలు కేంద్రాలను నెలకొల్పాలని అధికారులకు ఆదేశం
అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక
నవతెలంగాణ- నిజామాబాద్ సిటీ
ప్రస్తుత వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. 2025-2026 వానాకాలం సీజన్ వరి ధాన్యం సేకరణకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలోని కాన్ఫరెన్సు హాల్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ బుధవారం సంబంధిత శాఖల అధికారులతో, ఐకేపీ మహిళా సంఘాల ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే నెల అక్టోబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తేనున్న నేపథ్యంలో, ముందస్తుగానే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులను నష్టపర్చే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని కలెక్టర్ స్పష్టమైన హెచ్చరికలు చేశారు. జిల్లాలో ఈసారి ఖరీఫ్ సీజన్ లో లక్షా 76 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేశారని, సుమారు 12.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేతికందుతుందని అంచనా వేశామన్నారు. ఇందులో సన్న రకం ధాన్యం అత్యధికంగా 11 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని అన్నారు. రైతులు తమ సొంత అవసరాల కోసం, ఇతర ప్రైవేట్ వ్యాపారులకు విక్రయాలు జరిపే ధాన్యాన్ని మినహాయిస్తే, ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని తరలించే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నామని అన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 663 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పుతామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ధాన్యం దిగుబడులు చేతికందే సమయానికి కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, పూర్తిస్థాయి మద్దతు ధర పొందేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం ‘ఏ’ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 ధర చెల్లించడం జరుగుతుందన్నారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు ప్రభుత్వం బోనస్ అందిస్తోందని గుర్తు చేశారు. ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం సేకరణలో ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బిల్లుల చెల్లింపులలో జాప్యానికి తావు లేకుండా ట్యాబ్ ఎంట్రీలు వేగంగా జరగాలని, నిర్ణీత కాల వ్యవదిలోపే రైతుల ఖాతాలలో బిల్లు మొత్తాలు జమ అయ్యేలా చొరవ చుపాలన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి మరింత సాఫీగా, సజావుగా ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఏ చిన్న ఇబ్బందికి సైతం తావులేకుండా ధాన్యం సేకరణను సజావుగా నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, ఆభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డీఆర్డీఓ సాయాగౌడ్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిణి గంగూబాయి, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ రావు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, సహకార సంఘాల సీ.ఈ.ఓలు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.