జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్
నవతెలంగాణ – పాలకుర్తి
రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికను రూపొందించామని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ అన్నారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని మల్లంపల్లి క్లస్టర్సం ను వర్ధన్నపేట ఏసీపి అంబటి నర్సయ్య తో కలిసి దర్శించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆర్ ఓ తో పాటు ఏ ఆర్ ఓ, నామినేషన్ల స్వీకరణ సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ ఈనెల 17న జరిగే మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని సూచించారు. ఎన్నికల పేరుతో గ్రామాల్లో అల్లర్లను సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యత్మకమైన గ్రామాలను గుర్తించి ఇలాంటి గొడవలు జరగకుండా నివారణ చర్యలు చేపడుతామని తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరిగిన పోలీసులకు సమాచారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ తో పాటు నామినేషన్ల స్వీకరణ సిబ్బంది పాల్గొన్నారు.



