Wednesday, February 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రామీణ మంచినీటి సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు

గ్రామీణ మంచినీటి సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు

- Advertisement -

వేసవిలో ఇబ్బందులు రాకుండా ప్రణాళిక : పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్రామీణ మంచినీటి సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ లోని ఎర్రమంజిల్‌ మిషన్‌ భగీరథ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిషన్‌ భగీరథ సోర్స్‌ పాయింట్లు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, పంపింగ్‌ వ్యవస్థ, గ్రామాలవారీగా సరఫరా పరిస్థితులపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వ ఉందనీ, వేసవిలో ఇబ్బందులు ఉండవని వివరించారు. ఎస్‌ఈ పరిధిలో ఇంటింటికి తాగునీరు అందుతున్న పరిస్థితిని స్వయంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఆవాసాల్లో కేవలం 150 ఆవాసాలకు మాత్రమే మిషన్‌ భగీరథ నీరు అందడం లేదని, ఇటీవల కొత్తగా 397 ఆవాసాలు ఏర్పాటయ్యాయని అధికారులు తెలిపారు. కొండలపై, అటవీ ప్రాంతాల్లో పైప్‌లైన్‌ వేయడం సవాల్‌గా ఉన్న చోట్ల స్థానిక జల వనరులను వినియోగించి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలని ఆదేశించారు. వేసవి దష్ట్యా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని సూచించారు. సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని గ్రామాల వారీగా సరఫరా పరిస్థితిని సమీక్షించి, వారి సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు. సర్పంచ్‌లు ఫోన్‌ చేస్తే తక్షణం స్పందించాలనీ, సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల వారీగా తాగునీటి అవసరాలు, సరఫరా పరిస్థితులపై వారితో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సూచించారు. మిషన్‌ భగీరథ ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచాలన్నారు. గ్రామసభల్లో మిషన్‌ భగీరథ నీటి వినియోగంపై తీర్మానాలు చేయించి అవగాహన కల్పించాలని సూచించారు. వాస్తవాలను దాచిపెట్టి 100 శాతం నల్లా నీటి సరఫరా జరుగుతోందని నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. వాస్తవాలను నిజాయితీగా తెలియజేసి సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామీణ తాగునీటి సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు మంజూరు చేయలేదనీ, రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ప్రజల అవసరాలు తీర్చుతోందని చెప్పారు. ఈ రంగానికి తగిన నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా తాగునీటి సమస్యలు రాకుండా సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి సీతక్క అభినందించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌, మిషన్‌ భగీరథ ఈఎన్సీ కపాకర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆదిమ తెగలకు 150 రోజులు పని కల్పించాలి 9వ రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశం తీర్మానం
రాష్ట్రంలో అంతరించి పోతున్న ఆదిమ తెగలకు ‘వికసిత్‌ భారత్‌ – గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ (వీబీ-జీ ఆర్‌ఏఎంజీ) చట్టంలో 150 రోజులు పని కల్పించాలని 9వ రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశం తీర్మానించింది. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌. అంబేడ్కర్‌ సచివాలయంలో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దనసరి అనూయ సీతక్క అధ్యక్షతన మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం చర్చించింది. రాబోయే రెండేండ్లలో రాష్ట్రంలోని అన్నీ గ్రామాల్లో పంచాయతీ, అంగన్వాడీ, మహిళా సంఘాల భవనాలను నిర్మించాలనీ, గత అసెంబ్లీ సమావేశాల్లో వీబీ-జీ ఆర్‌ఏఎంజీ చట్టంపౖౖె చేసిన తీర్మానాన్ని బలపర్చాలనీ, పెరిగిన జీపీలకనుగుణంగా సిబ్బందిని పెంచాలని సమావేశం తీర్మానించింది. పనిముట్లు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. పని ప్రదేశాల్లో నీడ కోసం టెంట్‌, తాగు నీరు, ప్రథమచికిత్స తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో మండలి సభ్యులు సిద్దరపోయిన శ్రీనివాస్‌ ముదిరాజ్‌, గుమ్మడి సోమయ్య, చల్లా నారాయణ రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.శ్రీధర్‌, కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌, జాయింట్‌ కమిషనర్‌, శేషు కుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -