- Advertisement -
- – సమన్వయంతో పని చేస్తూ సమస్యలు తలెత్తకుండా చూడాలి
- – బక్రీద్ సందర్భంగా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్, సీ.పీ
- నవతెలంగాణ – కంఠేశ్వర్
- పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ అధ్యక్షతన శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశువుల అక్రమ రవాణా నిరోధం, జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, సీ.పీ సమీక్షించారు. బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలని అన్నారు. గోవధ నిషేధ చట్టం 1977 ప్రకారం గోవులను వధించడంపై నిషేధం ఉందని, తెలంగాణాలో ఒంటెలను కూడా వధించకుండా నిషేధం అమలులో ఉందని సూచించారు. ఈ విషయాలపై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తూ, ఎక్కడ కూడా గోవులు, ఒంటెలను వధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువులను స్లాటర్ హౌజ్ లలోనే వధించాలని, రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వధించరాదని సూచించారు. పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి ముందు తప్పనిసరిగా పశు వైద్యాధికారిచే ధ్రువీకరణ పొందాలని అన్నారు. బక్రీద్ పండుగ దృష్ట్యా వెటర్నరీ వైద్యులు అన్ని చోట్ల సరిపడా సంఖ్యలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాలూర, పొతంగల్, ఖండ్ గావ్ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు, సాటాపూర్, యంచ, ఇందల్వాయి, ఉమ్మెడ, జన్నెపల్లి, మామిడిపల్లి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని సీ.పీ తెలిపారు. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులు నిరంతరం నిఘా ఉండేలా పర్యవేక్షణ జరపాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని, క్షేత్రస్థాయికి వెళ్లి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా సంయమనంతో వ్యవహరిస్తూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు హితవు పలికారు. సీజ్ చేసిన పశువులకు తగిన షెల్టర్ కల్పిస్తూ, వాటికి పశుగ్రాసం, నీటి వసతి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సాటాపూర్, ఇందల్వాయి తదితర చోట్ల కొనసాగే పశువుల వారాంతపు సంతలలో నిబంధనలకు అనుగుణంగా, పశు సంరక్షణ చట్టానికి లోబడి క్రయవిక్రయాలు జరిగేలా చూడాలన్నారు. వ్యర్ధాలను ఎక్కడబడితే అక్కడ పారవేయకుండా చూడాలని, వ్యర్ధాలను వెంటదివెంట జనావాసాలకు దూరంగా తరలించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు సూచించారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుక జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర రావు, ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏ.సీ.పీలు రాజా వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, పోలీస్, రెవెన్యూ, పశు సంవర్ధక, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -