Sunday, December 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్‌లో మరింత కఠినమైన తనిఖీలు

యూఎస్‌లో మరింత కఠినమైన తనిఖీలు

- Advertisement -

పౌరులు కాని వారందరికీ బయోమెట్రిక్‌ తప్పనిసరి

వాషింగ్టన్‌ : గ్రీన్‌ కార్డులు ఉన్న వారు సహా అమెరికా పౌరులు కాని వారందరికీ సరిహద్దు నిబంధనలను ట్రంప్‌ ప్రభుత్వం కఠినతరం చేసింది. శుక్రవారం అమలులోకి వచ్చిన నూతన ఇమ్మిగ్రేషన్‌-పర్యాటక నిబంధనల ప్రకారం సరిహద్దును దాటే ప్రతి చోటా విదేశీయులు విధిగా బయోమెట్రిక్‌ వేయాల్సి ఉంటుంది. విమానాశ్రయాలు, భూ సరిహద్దులు, ఓడరేవుల ద్వారా అమెరికాలో ప్రవేశించే లేదా అక్కడి నుంచి నిష్క్రమించే పర్యాటకులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. అంటే ప్రతి ప్రవేశ, నిష్క్రమణ పాయింట్‌ వద్ద ప్రభుత్వ బయోమెట్రిక్‌ పర్యవేక్షణ ఉంటుంది.

ఏం చేస్తారు?
నూతన నిబంధనల ప్రకారం అమెరికా పౌరులు కాని వారు ఎవరైనా దేశంలో ప్రవేశించినా లేదా దేశం విడిచి వెళ్లినా ఆయా పాయింట్ల వద్ద కస్టమ్స్‌-సరిహద్దు రక్షణ అధికారులు వారి ఫొటోలు తీస్తారు. అన్ని వయసుల వారికీ…అంటే 14 సంవత్సరాల లోపు వారికి, అలాగే 79 సంవత్సరాల దాటిన వారికి…ఈ నిబంధన వర్తిస్తుంది. గతంలో వీరిని బయోమెట్రిక్‌ నిబంధనల నుంచి మినహాయించారు. పర్యాటకుల పరిశీలన సేవలో భాగంగా అధికారులు వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్‌ కూడా తీసుకుంటారు. వాటిని పర్యాటక-ఇమ్మిగ్రేషన్‌ రికార్డులతో సరిపోల్చుతారు.

గ్రీన్‌ కార్డులు ఉంటే…
గ్రీన్‌ కార్డులు ఉన్న వారికి ప్రతి సరిహద్దు క్రాసింగ్‌ వద్ద బయోమెట్రిక్‌ తనిఖీలు ఉంటాయి. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. గతంలో జరిపిన పర్యటనల చరిత్రలను నిశితంగా పరిశీలిస్తారు. ప్రాసెసింగ్‌ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని అధికారులు హెచ్చరించారు. పర్యాటకులు తమ వద్ద అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఆఫ్ఘనిస్తాన్‌, హైతీ, ఇరాన్‌, సోమాలియా, సూడాన్‌, వెనిజులా, యెమన్‌ సహా 19 దేశాల పౌరులకు జారీ చేసిన గ్రీన్‌ కార్డులను నఖశిఖపర్యంతం తనిఖీ చేస్తారు. ఈ దేశాల వారికి అదనపు ప్రశ్నలు సంధిస్తారు. కాబట్టి మరింత జాప్యం జరగవచ్చు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్‌ లేదా పర్యటనకు సంబంధించిన దరఖాస్తులు పెండింగులో ఉంటే తీవ్ర జాప్యం ఏర్పడుతుంది.

ఏం చేయాలంటే…
అమెరికా పౌరులు కాని వారు సరిహద్దు ప్రక్రియల నిమిత్తం అదనపు సమయం అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే న్యాయ సలహా తీసుకోవాలి. గ్రీన్‌ కార్డులు ఉన్న వారు…ముఖ్యంగా పైన తెలిపిన దేశాల వారు…తమ పత్రాలను తాజా పరచుకోవాల్సి ఉంటుంది. అదనపు తనిఖీలకు వారు సిద్ధంగా ఉండాలి. మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకూ బయోమెట్రిక్‌ పద్ధతి అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. ముందుగా విమానాశ్రయాలలో, ఆ తర్వాత భూ సరిహద్దులు, ఓడరేవుల వద్ద దీనిని అమలు చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -