– శాఖల మధ్య సమన్వయం పెరగాలి మహిళా భద్రత, సాధికారతపై కీలక నిర్ణయాలు
– పాఠశాల స్థాయి నుంచే స్వీయరక్షణ శిక్షణ తప్పనిసరి : ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహిళల సమగ్ర అభివృద్ధికి శాఖల మధ్య సమన్వయం పెరగాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మహిళల అభివృద్ధి, సాధికారత, సమాన అవకాశాలు, భద్రత అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల నుంచి సూచనలను స్వీకరించారు. మహిళల సమగ్ర సంక్షేమం కోసం శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. అభివృద్ధి, సమాన అవకాశాలు, రక్షణ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల అభిప్రాయాలు తెలుసుకుని, అంశాల వారీగా సబ్ కమిటీల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లింగ వివక్షను నిర్మూలించి మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలోనే లింగ సమానత్వ భావనను బలపరిచే విధంగా పాఠ్యాంశాలలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని సమావేశంలో చర్చించారు. ఉద్యోగ రంగంలో మహిళలకు సమాన హక్కులు, ప్రయివేటు రంగంలోనూ మహిళలకు మెటర్నిటి బెనిఫిట్ యాక్ట్ అమలు వంటి అంశాలపై విధాన పరమైన మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.
మహిళా శిశు సంక్షేమ, పోలీస్ శాఖల సమన్వయంతో మహిళా భద్రత విషయంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సమావేశంలో ప్రతిపాదించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక షీ సైబర్ ల్యాబ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించనున్నారు. పొక్సో కేసులు, మానవ అక్రమ రవాణా బాధితుల కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. పాఠశాల స్థాయి నుంచే స్వీయరక్షణ శిక్షణను తప్పనిసరి చేయడం ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సిన అవసరాన్ని మంత్రి సీతక్క ప్రస్తావించారు.
పాఠశాలలు, హాస్టళ్లలో కిషోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత వంటి సమస్యలను ముందుగానే గుర్తించాలని మంత్రి సూచించారు. అదనపు పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచాలని సమావేశంలో నిర్ణయించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు గ్రామ స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే టీనేజీ బాలికల మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా మంచి చెడులపై అవగాహన కల్పించేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మూవీ థియేటర్లలో మహిళా హక్కులు, చట్టపరమైన శిక్షలపై అవగాహన ప్రకటనలు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని సీతక్క సూచించారు. పిల్లలపై లైంగిక నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలనీ, మానవ అక్రమ రవాణా నియంత్రణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో వెలువడిన సూచనల అమలుకు అంశాల వారీగా సబ్ కమిటీలు ఏర్పాటు చేసి, తక్షణమే కార్యాచరణ బృందాలను నియమించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రతి శాఖ సమన్వయంతో సమగ్ర చర్యలు చేపట్టాలని, నిర్ణయాల అమలుపై నిరంతర సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
మహిళల సమగ్రాభివృద్ధికి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



