లీజు భూమి, షాపుల రెగ్యులరైజేషన్‌కు అవకాశం
ఇండ్ల పక్కన ఉన్న వంద గజాల్లోపు స్థలాల విక్రయాలకు పచ్చజెండా : మంత్రి పొంగులేటి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని కోరారు. హౌసింగ్ బోర్డు భూములపై సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. హౌసింగ్ బోర్డు భూముల లీజు, ఒప్పందాలు, కోర్టు కేసులు, అద్దెలు తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు లీజు, కమర్షియల్, అద్దెలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిజాం కాలం నుంచి 115 సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇవ్వడం జరిగిందనీ, ఇందులో ప్రధానంగా విద్యాసంస్థలు, గృహ వినియోగం, వాణిజ్యం, దేవాలయాలు తదితరాలున్నాయని వివరించారు. ఏడు స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు, అలాగే అద్దెబకాయిలున్నాయంటూ అధికారులు మంత్రికి వివరించారు. లీజు ఒప్పందాల పునరుద్దరణ చేసుకుని సంస్థలకు హౌసింగ్ బోర్డు తరపున లేఖలు రాసి వాటి రెగ్యులరైజేషన్‌కు అవకాశమివ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో హౌసింగ్ బోర్డుకు వివిధ ప్రాంతాల్లో 301 వాణిజ్య దుకాణాలు ఉండగా 2007లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు 14 మంది షాపులు కొనుగోలు చేశారని వివరించారు. మిగిలిన 287 దుకాణాలకుగాను 62 దుకాణాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయనీ, హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి దుకాణం యజమాని ఏటా 10 శాతం అద్దెను పెంచుతూ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఈ నిబంధన అమలు కాకపోవడంతో దుకాణ యజమానుల నుంచి హౌసింగ్ బోర్డుకు రూ.కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం షాపులు నిర్వహిస్తున్నవారు వాటిని కొనుగోలు చేయడానికి ముందుకొస్తే మార్కెట్ ధర ప్రకారం విక్రయించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. దుకాణం నిర్వహణకు అనువుగా లేకుంటే ఆ స్థలాన్ని వేలంలో విక్రయించాలని కోరారు.
కోర్టు కేసులపై ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించాలి
కోర్టు కేసుల్లో ఉన్న భూములు హౌసింగ్ బోర్డుకు చెందేలా పటిష్టమైన వాదన వినిపించేలా ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించుకోవాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హౌసింగ్ బోర్డు గతంలో కేటాయించిన ఇండ్లకు పక్కనే ఉన్న వంద గజాల్లోపు స్థలాలను ఆ ఇంటి యజమానికి ఆసక్తి ఉంటే విక్రయించాలని సూచించారు. గతంలో ఇంటి కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఇప్పుడు ఆ అవకాశం కల్పించాలని కోరారు. పక్కనే ఉన్న వంద గజాల్లోపు స్థలాన్ని కూడా కొనుగోలు చేసుకుంటే మొత్తం స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశమివ్వాలని సూచించారు. మార్కెట్ ధర, సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ వంద గజాల్లోపు స్థలాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల వివరాలు, రిజిస్ట్రేషన్ చేసుకుని పక్కనే ఉన్న వంద గజాల్లోపు స్థలాన్ని అడుగుతున్నవారి వివరాలు తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక తయారుచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వీటిపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు ఎండీ విపి గౌతమ్, సీఈ వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



