పాలకులు మారినా అవే విధానాలు
ఆమార్పు కోసమే కొట్లాడాలి : కల్లు గీత కార్మిక సంఘం నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోగలమని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. పాలకులు మారినా వారి విధానాల్లో మార్పులు ఉండట్లేదనీ, ఆ మార్పుల కోసమే కొట్లాడాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షను ఆయన ప్రారంభించారు. వినతిపత్రాల సమర్పణతో పనులు జరుగుతాయన్న నమ్మకం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు వచ్చి వాగ్ధానాలు చేస్తున్నారే తప్ప అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు.
కల్లుగీత కార్మికులు బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు డిమాండ్ చేస్తుంటే, రేవంత్ సర్కార్ గతేడాది రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి, కేవలం రూ.17 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. కల్లు గీత కార్మికుల కోరికలు చాలా చిన్నవనీ, వాటిని తీర్చేందుకు కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాల వృత్తిదారుల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తే ప్రభుత్వాన్ని గౌరవిస్తామనీ, లేదంటే ఉద్యమిస్తామని చెరుపల్లి హెచ్చరించారు. ఉద్యమం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని కల్లు గీత కార్మిక సంఘానికి ఆయన సూచించారు.
గౌడ్స్‌పై కక్ష కట్టిన కాంగ్రెస్ సర్కార్:శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రంలో గౌడ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష కట్టిందనీ, వారిని ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నదని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కల్తీ కల్లు పేరుతో గౌడ్స్‌ను ఆర్థికంగా దెబ్బతీసే చర్యలకు పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు తాగే పాల కల్తీపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల సంగతేమో గానీ, గతంలో ఉన్న సౌకర్యాలను కొనసాగించడం లేదనీ, ఒక్క రూపాయి ఖర్చు కానీ నందనం నీరా ప్రాజెక్టు వంటివి కూడా తెరవడం లేదని ఆయన దుయ్య బట్టారు. నెక్లెస్ రోడ్‌లో బీఆర్‌ఎస్ హయాంలో తెరిచిన నీరా కేఫ్‌ను నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. గతంలో గీత కార్మికులు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చి, గతంలో ఇచ్చిన రూ.5 లక్షలను కూడా ఇవ్వడం లేదని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాలను ఉధృతంగా చేయాలనీ, తాము అండగా ఉంటామని తెలిపారు.
ప్రజా సంఘాల మద్దతు
కల్లు గీత కార్మిక సంఘం చేస్తున్న పోరా టానికి పలు ప్రజా సంఘాలు, బీసీ సంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, తెలంగాణ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, తెలంగాణ రజక సంఘం ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, తెలంగాణ మత్య్సకారులు, మత్యకార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, బ్యాండ్, వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మద్ధతు ప్రకటించిన వారిలో ఉన్నారు. వీరితో పాటు గీత పనివారల సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మగాని నాగభూషణం, గౌడ జన సంక్షేమ సంఘం నాయకులు బీసీ పొలిటికల్ ఫ్రంట్ తదితర సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లుతో పాటు ఉపాధ్యక్షులు వి.వెంకట నర్సయ్య, బొలగాని జయరాములు, గౌని వెంకన్న, గౌని సాంబయ్య, బాల్నె వెంకటమల్లయ్య, కార్యదర్శులు, చౌగని సీతారాములు, యస్, రమేశ్ గౌడ్, బండకింది అరుణ్, కొండం కరుణాకర్, యస్.వెంకట్ గౌడ్, రాగీరు క్రిష్ణయ్య, బుర్ర శ్రీనివాస్, యమగాని వెంకన్న, మెరుగు వీరస్వామి, బుర్రా శ్రీనివాస్ గౌడ్, బీమగోని చంద్రయ్య, కోహెడ కొమురయ్య ఒక రోజు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దీక్ష అనంతరం కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పల్లె రవి కుమార్, డాక్టర్ వినయ్ కుమార్ గౌడ్‌లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
10 రోజుల్లో పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం : ఎంవీ రమణ, కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు
10 రోజుల్లో తమ డిమాండ్లను పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు ఎంవీ రమణ హెచ్చరించారు. రాష్ట్రంలో 5 లక్షల కల్లుగీత వృత్తిదారుల కుటుంబాలున్నాయని, బడ్జెట్‌లో వారికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గత రెండేండ్లలో చెట్లపై నుంచి 850 మంది పడిపోగా వారిలో 120 మంది చనిపోయారనీ, 170 మంది శాశ్వత వికలాంగులుగా మారారనీ, మిగిలిన వారికి గాయాలయ్యాయని తెలిపారు.
వారికి రూ.14 కోట్లను ఎక్స్‌గ్రేషియా కింద వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన కొత్త సొసైటీలకు ఐదెకరాల స్థలం కేటాయింపు, కొత్త దరఖాస్తులను స్వీకరించాలని కోరారు. ఏజెన్సీ ఏరియాల్లో సొసైటీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రెండేండ్లుగా విన్నవిస్తున్నామనీ, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసినా ప్రయోజనం లేకపోయిందని తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తారో? లేకపోతే తమతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పోరాటంలో కలిసి వస్తారో? తేల్చుకోవాలన్నారు.



