సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నరసింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసమానత, దోపిడీ, మతతత్వం, కార్పొరేట్-ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలను తీవ్రతరం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ.నర్సింహ పిలుపునిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్బంగా నిర్వహించబోయే జనసేవాదళ్ భారీ కవాతు పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లోని నారాయణగూడలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీపీఐ వందేండ్ల చరిత్ర మహౌన్నతమైనదని తెలిపారు. ఈ శతాబ్ది ఉత్సవం కేవలం చరిత్ర గురించి మాత్రమే కాదనీ, ప్రజాస్వామ్యాన్ని రక్షంచడానికి, సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని మరింతగా పెంచడానికి, మతతత్వం, ఫాసిజం, అసమానత శక్తులను ప్రతిఘటించడానికి అని స్పష్టం చేశారు.
కార్మికులు, రైతులు, మహిళలు, అణగారిన వర్గాల గొంతుకగా ఎర్ర జెండా సమానత్వం, లౌకికవాదం, గౌరవం కోసం నిలుస్తుందని చెప్పారు. శతాబ్ది ఉత్సవాల స్పూర్తితో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడటం కోసం, ప్రజల జీవనోపాధి కోసం బలమైన పోరాటాలు జరగాలని ఆకాంక్షించారు. ఈ నెల 18న ఖమ్మం నగరంలో లక్షలాదిమందితో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎస్.ఛాయాదేవి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్, కంపల్లి శ్రీనివాస్, షంషుద్దీన్, జిల్లా సమితి శక్రి భాయ్, ఆరుట్ల రాజ్ కుమార్, జనసేవాదళ్ శిక్షకులు మేకల శ్రీనివాస్, మరుపాక అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



