– ఏఐకేఎస్ వార్షికోత్సవ సభలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
– ఆ సంఘం జెండాను ఆవిష్కరించిన సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా ఏఐకేఎస్ ఆవిర్భావ స్ఫూర్తితో పోరాటాలను ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయం ఎదుట సంఘం జెండాను సారంపల్లి మల్లారెడ్డి ఎగురవేశారు. అనంతరం మల్లారెడ్డి, టి.సాగర్ మాట్లాడుతూ.. దేశంలోని రైతులను ఒకే తాటిపైకి తెచ్చి వారి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏఐకేఎస్ ఆవిర్భావించి 90 ఏండ్లు అవుతున్నదని తెలిపారు. 1936లో లక్నో వీధుల్లో చిన్న మొలకగా ప్రారంభమైన ఏఐకేఎస్ నేడు కోట్లాది మంది రైతుల గొంతుకగా మారి మహావృక్షంలా విస్తరించిందన్నారు. రైతుల సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించడానికి ఒక వేదిక కావాలని వామపక్ష నాయకులు, సోషలిస్టులు నిర్ణయం మేరకు ఏఐకేఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. మొదటి అధ్యక్షుడు స్వామి సహజానంద సరస్వతి (బీహార్ రైతు నాయకుడు), ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ ఎన్.జి. రంగ (ఆంధ్రప్రదేశ్) అని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1946-1951) ఇది ప్రపంచ రైతాంగ ఉద్యమాల్లోనే ఒక అద్భుతమనీ, నిజాం నవాబు, అతని సాయుధ బలగాలైన రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు వీరోచితంగా పోరాడారని వివరించారు.
4 వేల మందికిపైగా అమరుల త్యాగాలతో 3000 గ్రామాల్లో రైతుల రాజ్యం ఏర్పడిందనీ, పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని కొనియాడారు. ఆ పోరాటమే మన దేశంలో భూసంస్కరణలకు ప్రధాన ప్రేరణగా నిలిచిందన్నారు. ”పంటలో మూడింట రెండు వంతులు కౌలుదారుడికే దక్కాలి” అనే డిమాండ్‌తో బెంగాల్లో తేబాగా, భూస్వాములకు వ్యతిరేకంగా కేరళలో పున్నప్ర-వయలార్ పోరాటాలు జరిగిన తీరును వివరించారు. కిసాన్ సభ కేవలం ఆర్థిక సమస్యల మీదనే కాకుండా, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా కూడా పోరాడిందని చెప్పారు. 1991 తర్వాత వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడిందనీ, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పెట్టుబడి ఖర్చుపై 50 శాతం లాభం కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలని కిసాన్ సభ ప్రధానంగా డిమాండ్ చేస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన చారిత్రాత్మక రైతాంగ పోరాటంలో ఏఐకేఎస్ కీలకపాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు భూపాల్ ,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, రైతు నాయకులు వెంకట్ రెడ్డి, శివకుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా పోరాటాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



