మహిళలు సామ్రాజ్యవాద ప్రమాదాన్ని గమనించాలి
మానవత్వమే ఎజెండాగా ముందుకు సాగాలి
‘ఐద్వా’ 14వ జాతీయ మహాసభల ప్రారంభోపన్యాసంలో ప్రముఖ రచయిత, సినీనటి ఎమ్ రోహిణి
ప్రతి ప్రతిఘటనలోనూ ‘ఐద్వా’ జెండా : బృందాకరత్
ఎన్నికల్లో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం : శాంతాసిన్హా
మనుస్మృతి అమలుకు మోడీ సర్కార్ కుట్ర : పీకే శ్రీమతి టీచర్
‘సర్’ ముసుగులో మహిళలు,పేదల ఓట్ల తొలగింపు : మరియం ధావలే
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహిళలు పోరాటాల ద్వారానే సమానత్వాన్ని సాధించగలుగుతారని ప్రముఖ రచయిత, సినీనటి ఎమ్ రోహిణి అన్నారు. దానికంటే ముందు మన ఇండ్ల నుంచే అభ్యుదయంతో కూడిన సమానత్వం ప్రారంభం కావాలనీ, ఆ మేరకు మార్పును ఆహ్వానించాలని సూచించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహా సభలు ఆదివారంనాడిక్కడి ఆర్టీసీ కళ్యాణ మండపం లోని మల్లు స్వరాజ్యం ప్రాంగణం, కామ్రేడ్ సరోజినీ బాలానందన్ నగర్, కామ్రేడ్ చంద్రకళాపాండే హాల్‌లో ప్రారంభమయ్యాయి. దీనిలో రోహిణి ప్రారంభోపన్యాసం చేశారు. యువతరం సామ్రాజ్యవాద ప్రమాదాన్ని గమనించాలనీ, ఆ దిశగా కుటుంబాలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యతను మహిళలే తమ భుజస్కందాలపై వేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. దేశంలో మహిళా హక్కులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయనీ, వారిపై ఆంక్షలు, వివక్ష ఇంటి నుంచే మొదలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండ్లలో మౌనసాక్షులుగా గొంతులేకుండా ఉన్న మహిళల హక్కుల కోసం ‘ఐద్వా’ పోరాడుతుందని తెలిపారు. మహిళల హక్కుల్ని ఎవరో నిర్దేశించడం సరికాదనీ, మహిళలే వాటిని నిర్థారించుకోవాలని సూచించారు. యువతరం సామ్రాజ్యవాద ప్రమాదాన్ని గమనించాలనీ, సమానత్వం కోసం పోరాటం కొనసాగుతూనే ఉండాలన్నారు. మహిళల స్వాతంత్య్రం, సమానత్వంపై జరుగుతున్న అబద్ధ ప్రచారాలను అర్ధం చేసుకోవాలని కోరారు. దేశంలో రాజ్యాంగ పీఠిక సవాళ్లను ఎదుర్కొంటున్నదనీ, దానిలోని సమానత్వానికి విఘాతం కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో మార్పుకోసం మహిళలు తాము చేస్తున్న పనుల్నే ఆయుధాలుగా మార్చుకోవాలని సూచించారు.
చేతులెత్తి ఆకాశంవైపు చూస్తూ ఈ పూటకు తిండి పెట్టమని ప్రార్థించడం వల్ల సమాజంలో మార్పు రాదనీ, పోరాడితేనే సామాజిక మార్పు సాధ్యమౌతుందనీ, దీనికి భాష, ప్రాంతం, జాతి, మతంతో సంబంధం లేదని స్పష్టంచేశారు. పోరాట ఫలితాల్లో మనిషి, మానవత్వం అనేవే ప్రధానంగా ఉండాలన్నారు. కట్నం తీసుకోం – ఇవ్వబోం అనే నినాదం మన ఇండ్ల నుంచే ప్రారంభం కావాలని చెప్పారు. మహాసభల్లో కీలకోపన్యాసం చేసిన మాజీ ఎంపీ, ఐద్వా నేషనల్ ప్యాట్రన్ బృందాకరత్ మాట్లాడుతూ భారతదేశంలో అన్యాయాన్ని ప్రతిఘటించిన ప్రతి ప్రాంతంలోనూ బలహీనులకు అండగా ఐద్వా జెండా నిలిచిందని గుర్తుచేశారు. నరేగా చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జీ రాంజీ పేరుతో నిర్వీర్యం చేస్తున్నదనీ, దానికి వ్యతిరేకంగా మరింత బలమైన ఉద్యమాలు రావాలని పిలుపునిచ్చారు. దేశానికి సోషలిజమే ప్రత్యామ్నాయమనీ, దాన్ని తాము పూర్తిగా విశ్వసిస్తామని స్పష్టం చేశారు.
కేంద్రంలోని ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా సామ్రాజ్యవాదానికి మోకరిల్లేలా ఉంటున్నాయని ఆక్షేపించారు. గాజాపై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న మారణకాండను తీవ్రంగా ఖండించారు. మోడీ ప్రభుత్వ నకిలీ జాతీయవాదం ఆయన చర్యల్లో స్పష్టంగా కనిపిస్తున్నదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం నారిశక్తి వంటి ఉద్యమ నినాదాలను హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తూనే, మహిళల హక్కులపై దాడిని ముమ్మరం చేసిందన్నారు. స్వాగతోపన్యాసం చేసిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఐద్వా రిసెప్షన్ కమిటీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నదనీ, పోలింగ్ కేంద్రాల్లో వారి ఓటింగ్ శాతమే అధికంగా ఉంటున్నదని తెలిపారు.
ఎన్నికల హామీలు అమలు చేయకుంటే ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తున్నది కూడా మహిళలేనని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా మహిళల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యానికి ఇది నిదర్శన మన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐద్వా అఖిలభారత అధ్యక్షురాలు పీకే శ్రీమతి టీచర్ మాట్లాడుతూ దేశంలో మనుస్మృతిని అమల్లోకి తేవడమే మోడీ సర్కార్ లక్ష్యమనీ, దానికోసమే బీజేపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నదని అన్నారు. ప్రజాపోరాటాల నేపథ్యంలో యుపీఏ-1 ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, సంక్షేమంలో గాంధీ వారసత్వంపై సైద్దాంతిక దాడిని తీవ్రతరం చేశారని తెలిపారు. మహాసభలో కీలకో పన్యాసం చేసిన ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మాట్లాడుతూ ఎన్‌ఆర్సీ, సీఏఏ విఫలమవడంతో ఇప్పుడు ‘ఎస్‌ఐఆర్’ ముసుగులో పేదలు, మహిళల ఓట్లను మోడీ ప్రభుత్వం రద్దు చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. పశ్చి బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో 25లక్షలకు పైగా మహిళా ఓట్లను తొలగించారన్నారు. సామాజిక వివక్ష, అణచివేతలను ఎదిరించే ప్రతి మహిళకూ ఐద్వా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతకుముందు సభలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆడిపాడి సభికుల్ని అలరించారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం నేతలంతా ప్రదర్శన, బహిరంగసభలో పాల్గొన్నారు.
సమానత్వ భావనకు పెనుముప్పు: నాగమణి, ఆలిండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ కార్యదర్శి
సమాజంలోని సమానత్వ భావనకు పెను ముప్పు పొంచి ఉంది. మహిళలు పోరాటాల ద్వారా సాధించుకున్న పురోగతిని, కష్టార్జితాన్ని నిర్వీర్యం చేసేలా చట్టాలను మారుస్తున్నారు. ఆశారాం బాపు, కుల్దీప్ సింగ్ వంటి లైంగిక దాడి నిందితులను విడుదల చేస్తూ వారు ఆ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం అనేది ఇప్పటికీ అందని ద్రాక్షలాగే ఉంది.
పాత కాలపు ఆలోచనలు మారాలి: శోభ, ఆలిండియా మహిళా సాంస్కృతిక సంఘటన్ అధ్యక్షులు
21వ శతాబ్దంలో కూడా ఆడపిల్లగా పుట్టలేని దుస్థితిని మనం చూస్తున్నాం. మహిళల పట్ల సమాజ దృక్పథం ఇంకా పాతకాలపు ఆలోచనలతోనే ఉంది. భూస్వామ్య విలువలే అనుసరించబడుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలు కరువయ్యాయి. పెట్టుబడిదారీ విధానం వల్ల పేదరికం, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పాత కాలపు ఆలోచనలను విడనాడి భూస్వామ్య, పెట్టుబడిదారీ భావజాలాలకు వ్యతిరేకంగా మనం ఐక్యంగా పోరాడాలి.



