ఆందోళనలతోనే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను అడ్డుకుంటున్నాం
ఉపాధి చట్టాల మార్పు జాతీయ నేరం
‘వీబీ జీ రామ్ జీ’ తో పేదల జీవితాలు ధ్వంసం
ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి : సీఐటీయూ ఆలిండియా ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
సీఐటీయూ మహాసభల నుంచి ఎస్.వెంకన్న
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు అనివార్యం అని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ నొక్కి చెప్పారు. ఐదేండ్లుగా పోరాటాల ద్వారానే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను అడ్డుకోగలిగామని తెలిపారు. ఉపాధి హామీ చట్టం మార్పు జాతీయ నేరమనీ, ‘వీబీ జీ రామ్‌జీ’ తో పేదల జీవితాలు ధ్వంసం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికుల హక్కులపై దాడి చేస్తుందని, మొత్తంగా ప్రజా వ్యతిరేకత (యాంటీ పీపుల్ ఫేస్)తో మోడీ పాలన సాగుతుందని అన్నారు. విశాఖలోని ఆర్కే బీచ్ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో గురువారం మధ్యాహ్నం సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నరసింగరావుతో కలిసి మీడియా
సెంటర్‌లో తపన్‌సేన్ మాట్లాడారు. విశాఖలో ఐదు రోజుల పాటు జరిగే అఖిల భారత మహాసభల్లో భవిష్యత్ కార్మిక, కర్షక పోరాటాలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులు చర్చిస్తున్నారన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం మార్చడంతో ఉపాధికి గ్యారెంటీ పోయిందని, భూస్వాముల పొలాల్లో కూలీలు పనిచేస్తేనే ఈ చట్టం ద్వారా డబ్బులు చెల్లిస్తామనడం ఘోరమైన తప్పిదమని ఎత్తిచూపారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ఫిబ్రవరి 12న జనరల్ సమ్మెలో సిద్ధం అయ్యేలా సన్నద్ధం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని తెలిపారు. కేంద్రం తన వాటాను తగ్గించుకోవడం, రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం సరిగాదన్నారు. రాష్ట్రాల వద్ద డబ్బు లేకపోతే ఈ పథకం ముందుకు నడవదని చెప్పారు. 2005 నుంచి మొన్నటివరకూ ఉపాధి పనులు చాలా జరిగాయని కేంద్ర కొత్త చర్య ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసేలా ఉందని విమర్శించారు. ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం మనదేశంలో 50శాతం ఉన్న ప్రజల చేతిలో 10శాతం సంపద, 6 శాతం ఉండే కార్పొరేట్ల గుప్పెట్లో 50శాతం సంపద ఉండటాన్ని చూస్తే ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఘోరంగా విఫలమైందని దీనిని బట్టే తెలుస్తోందని వివరించారు.
పోరాటాల వల్లే ఆగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేండ్లుగా క్రమం తప్పకుండా కార్మిక పోరాటాలు చేయడం వల్లే వైజాగ్ ఉక్కు ప్రయివేటు పరం కాలేదన్నారు. సెయిల్‌లో 30శాతం ప్రయివేటు పరం జరిగిందనీ, విశాఖ ఉక్కు కోసం కార్మికులు సమరశీలంగా పోరాడడాన్ని అభినందించారు. కార్మికులను అణచడానికే లేబర్ కోడ్‌లను కేంద్రం తీసుకొచ్చిందనీ, యూనియన్లు లేకుండా చేయడమే కేంద్రం లక్ష్యమని విమర్శించారు. వాటిపై కార్మికులు ఎడతెరిపిలేని పోరాటాలు సాగించాలని ఈ మహాసభల్లో ప్రతినిధులంతా తీర్మానించారని తెలిపారు. పోరాటాలకు సిద్ధమయ్యే కార్యాచరణ చేస్తారన్న నమ్మకం తనకుందన్నారు.



