ట్రంప్ టారిఫ్ టెర్రరిజంపై విస్తృత ప్రచారోద్యమం
దేశవ్యాప్తంగా పాలస్తీనా సంఘీభావ సమావేశాలు
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపు
– సెప్టెంబరు చివరి వారంలో ట్రంప్ టారిఫ్ టెర్రిజానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేపట్టాలి. అమెరికా ముందు తలొగ్గిన బిజెపి ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేయాలి.
– దేశవ్యాప్తంగా విస్తృత కార్యకలాపాల ద్వారా పాలస్తీనా సంఘీభావ ప్రచారాన్ని నిర్వహించాలి. బిజెపి ప్రభుత్వం అనుసరించే ఇజ్రాయిల్ అనుకూల విధానాలను బహిర్గతం చేయడానికి అన్ని రాష్ట్రాల రాజధానుల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలి. వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, కళాకారులు, వ్యక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి.
– ప్రజల జీవనోపాధులకు సంబంధించిన సమస్యలపై అన్ని రాష్ట్రాల కమిటీలు ఆందోళనలు, పోరాటాలు చేపట్టాలి.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం విస్త్రుత పోరాటాలు, ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టాలని సీపీఎం కేంద్ర కమిటీ ఆయా రాష్ట్ర కమిటీలకు దిశానిర్దేశం చేసింది. దీనికోసం ప్రజల్ని సన్నద్ధం చేయడం కోసం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్పడుతున్న టారిఫ్ టెర్రరిజంపై సెప్టెంబరు చివరి వారంలో విస్తృత ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చింది. అలాగే దేశవ్యాప్తంగా పాలస్తీనా సంఘీభావ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో ఈ నెల 13 నుంచి 15 తేదీ వరకు పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయి. దీనిలో పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఒక ప్రకటన జారీ చేశారు.
ప్రకటన పూర్తి పాఠం
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు దేశాన్ని సంక్షోభం వైపునకు నెడుతున్నాయి. పెరుగుతున్న ధరలు, పెరగని వేతనాలు, ఉధృతమవుతున్న అసమానతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగం పెచ్చరిల్లుతోంది. ముఖ్యంగా అమెరికా టారిఫ్‌లు విధించిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జులై 9న నిర్వహించిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసినందుకు దేశ కార్మిక లోకాన్ని కేంద్ర కమిటీ అభినందించింది. ఈ సమ్మెకు సంఘీభావం ప్రకటించిన రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర వర్గాల వారిని కూడా ప్రశంసించింది. సార్వత్రిక సమ్మెను ఇంతలా జయప్రదం చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సాగే పోరాటాలకు సీపీఎం మద్దతు కొనసాగిస్తుంది.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు/ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టిఎ/బిటిఎ) : వరుసగా స్వేచ్చా Ûవాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడానికి ముందుగా వివిధ పక్షాలను ప్రభుత్వం సంప్రదించాలి, ప్రజలకు కలిగే ప్రయోజనాలను జాగ్రత్తగా అంచనా వేయాలి. వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలన్న తొందరపాటు వల్ల పాల ఉత్పత్తులు, వ్యవసాయం, రక్షణ, ఫార్మాస్యూటికల్స్, ఆర్థికం వంటి కీలక రంగాల్లో దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అవుతుంది.
కార్పొరేట్లకు రాయితీలు : దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చేస్తున్న విఫల ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర కేబినెట్ భారత కార్పొరేట్లకు అనేక రాయితీలను ఆమోదించింది. వివిధ పథకాల పేర్లతో దాదాపు రూ.1,50,000 కోట్ల మేరకు రాయితీలను ప్రకటించింది. ముసాయిదా జాతీయ టెలికం విధానం (ఎన్‌టిపి)-2025 ప్రయివేటు కంపెనీలకు రాయితీలను ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వ రంగంలోని టెలికం కంపెనీల భవిష్యత్తును మాత్రం పట్టించుకోలేదు. బీజేపీ ప్రభుత్వం ప్రయివేటు కార్పొరేషన్లకు ప్రజా వనరులను బదిలీ చేస్తోందని, హిందూత్వ మతోన్మాద-కార్పొరేట్ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందన్న వాస్తవాన్ని ఈ పథకాలు వెల్లడిస్తున్నాయి.
జీఎస్టీ రేట్ల సవరణ
ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్‌ను సమావేశపరిచి కొన్ని ఉత్పత్తులపై రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే జీఎస్టీ స్లాబ్‌లపై తిరిగి కసరత్తు కూడా చేపట్టినట్లు తెలిపింది. నిరుపేదలు, సామాన్యులు ఉపయోగించే వస్తువులు, సేవలపై పన్నును తగ్గించడం స్వాగతించదగ్గ చర్యే. అయితే ఈ తగ్గింపు ప్రయోజనాలు కార్పొరేట్ల కన్నా వినియోగదారులకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందుకు అదనంగా, ఒకవేళ ఆదాయంలో నష్టమేమైనా ఉంటే, కేంద్రం ఆ పరిహారాన్ని రాష్ట్రాలకు అందచేయాల్సి వుంటుంది. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వం, ప్రజాస్వామ్య హక్కులను కుదించడానికి రాజ్యాంగ సంస్థలపై తనకు గల నియంత్రణను ఉపయోగించుకుంటోంది.
బలోపేతమవుతున్న నిరంకుశవాదం
ఎస్‌ఐఆర్ : బీహార్‌లో ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పూర్తి ఉల్లంఘనలతో నిండి వుంది. ఫలితంగా అనేకమంది పౌరులకు రాజ్యాంగపరంగా హామీ కల్పించిన ఓటు హక్కు తొలగించబడింది. ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అనుకూలంగా నిరంతరంగా వ్యవహరిస్తూ వచ్చిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్/సంఘపరివార్ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడంలో భాగస్వామిగా మారింది.
ఓటరు నమోదుకు గానూ ఆధార్ కార్డును చెల్లుబాటయ్యే పత్రంగా పరిగణించాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా, అర్హుడైన ఓటరు తన ఓటు హక్కును ఉపయోగించుకునేలా చూసేందుకు మనం అప్రమత్తంగా వుండాల్సి వుంది.
ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకించేందుకు, ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు అన్ని ప్రతిపక్షాలు ఒకే తాటిపైకి రావడం స్వాగతించాల్సిన అంశం. ఇతర ప్రతిపక్షాలతో సమన్వయం చేసుకోవడంలో, పౌరుల ఓటు హక్కును నియంత్రించే ప్రయత్నాలను ప్రతిఘటించడంలో సీపీఎం క్రియాశీల పాత్ర పోషిస్తుంది. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు తన పోరాటాన్ని కొనసాగిస్తుంది.
ప్రజా భద్రతపై మహారాష్ట్ర బిల్లు
బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన మహారాష్ట్ర ప్రజా భద్రతా బిల్లు ప్రజల ప్రజాస్వామిక హక్కులపై తీవ్రమైన దాడిని సూచిస్తోంది. ‘తీవ్రవాద వామపక్ష శక్తుల’పై పోరాటం సాకుతో అసమ్మతిని ఎలుగెత్తి చాటే స్వరాలను ప్రజా భద్రతకు, జాతీయ భద్రతకు ముప్పుగా చూపించడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తోంది. ‘తీవ్రవాద వామపక్ష శక్తులు’, ఇటువంటి సంస్థల నిర్వచనాలను ఉద్దేశ్యపూర్వకంగానే అస్పష్టంగా వదిలివేశారు. దీంతో రాజకీయ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకునే పరిధి మరింత విస్తృతమైంది. అసమ్మతిని అణచివేయడానికి, వ్యతిరేకత నోరు నొక్కివేయడానికి ఈ బిల్లులోని కఠినమైన నిబంధనలను దుర్వినియోగం చేసే తీవ్రమైన ప్రమాదం పొంచి వుంది.
ప్రజాస్వామ్య వ్యతిరేక బిల్లులు
30రోజుల పాటు కస్టడీలో వుంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులను తొలగించడానికి అనుమతించే మూడు బిల్లులను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమల్లో వున్న చట్టపరమైన పద్దతులు, విధి విధానాలను పక్కకు నెట్టే ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని ఈ బిల్లులు ఎత్తిచూపుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ నయా ఫాసిస్ట్ ధోరణులను దృష్టిలో వుంచుకుంటే ఇలాంటి నిబంధనలు ప్రతిపక్షాల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయుధాలుగా ఉపయోగించేందుకు ఉద్దేశించ బడ్డాయి. ఈ చర్య ఏ ప్రజాస్వామ్యంలోనైనా అత్యంత కీలకమైనటువంటి పరస్పర నియంత్రణలు, సమతుల్యతల (చెక్స్ అండ్ బ్యాలన్సెస్) వ్యవస్థపై దాడి చేస్తోంది.
బెంగాలీల తరలింపు
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో బెంగాలీ మాట్లాడే ప్రజలను ముఖ్యంగా బెంగాలీ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయి. పత్రాలను సక్రమంగా పరిశీలించకుండా లేదా అనుసరించాల్సిన ప్రక్రియలేవీ అనుసరించకుండా బెంగాలీలను బంగ్లాదేశీయులుగా గుర్తించి, ముద్ర వేస్తున్నారు. అనేకమందిని పోలీసులు నిర్బంధించి, వారిపట్ల అమానవీయంగా వ్యవహరిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నారు. భారత పౌరులతో సహా చాలామందిని బలవంతంగా సముద్ర, వైమానిక మార్గాల ద్వారా బంగ్లాదేశ్‌కు పంపివేసిన ఘటనలు కూడా వున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బెంగాలీ పౌరులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలి. చాలాచోట్ల బెంగాలీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులను సీపీఎం జోక్యం చేసుకుని వ్యతిరేకించింది. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది.
అస్సాంలో బహిష్కరణలు
అస్సాం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను వారి స్వంత భూముల నుండి బహిష్కరిస్తోంది. మతోన్మాద పోకడలు పెచ్చరిల్లడం కోసం ముఖ్యమంత్రి ఈ బహిష్కరణలను ఉపయోగిస్తున్నారు. ఆయా భూముల భూగర్భాల్లో ఖనిజ వనరులు సుసంపన్నంగా వుండడమే ఈ బహిష్కరణల వెనుక గల మరో ముఖ్యమైన ఉద్దేశ్యంగా వుంది. వాటిని దోచుకోవడానికి ప్రయివేటు కార్పొరేషన్లను అనుమతించాలని ప్రభుత్వం చాలా ఆతృతగా వుంది. ఈ అక్రమ బహిష్కరణలను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలి.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఢిల్లీలో ఎంపిక చేసిన కొద్దిమంది ఆహుతులతో జరిగిన మూడు రోజుల సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఫ్‌ుచాలక్ మోహన్ భగవత్ ప్రసంగిస్తూ, మథుర, కాశీ వివాదాలను తిరిగి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. సోదరభావంతో మెలగాలంటే అందుకు ముందస్తు షరతుగా ఈ రెండు ప్రాంతాల్లోని మసీదులను ముస్లింలు ఇచ్చి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి డిమాండ్లు మతోన్మాద విద్వేషాలను రెచ్చగొట్టడానికి, మత ప్రాతిపదికన సమాజాన్ని చీల్చడానికే ఉద్దేశించబడ్డాయి. భారత రాజ్యాంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నిర్లక్ష్యం చేస్తోందని ఈ దేశ చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నారని భగవత్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి. హిందూ రాష్ట్ర ఏర్పాటు దిశగా, సెక్యులర్ దేశాన్ని ధ్వంసం చేసే లక్ష్యంతో ముందుకు సాగాలన్న ఆర్‌ఎస్‌ఎస్ కృత నిశ్చయాన్ని ఈ వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఉప రాష్ట్రపతి ఎన్నిక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా బ్లాక్, రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని తమ అభ్యర్ధిగా పోటీకి నిలబెట్టింది. బిజెపి/ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వ మతోన్మాద భావజాలానికి, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం వంటి రాజ్యాంగ సూత్రాలపై వారి దాడులకు వ్యతిరే కంగా చాలా బలమైన సందేశాన్ని ఈ పోటీ పంపింది. తాము పెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్ధికి తమ ఓట్లన్నీ పోలయ్యాయా లేదా అని ఇండియా బ్లాక్ పార్టీలు చూసుకోవాలి.
నేపాల్‌లో సంక్షోభం
ఇటీవల నేపాల్‌ను కుదిపేసిన నిరసనలు, అక్కడ యువత ప్రధానంగా జనరేషన్ జడ్ పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనల్లో 70మంది మరణించడం పట్ల సిపిఎం విచారం వ్యక్తం చేసింది. వారికి సంతాపం తెలియచేసింది. ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతోనే ఒక్కసారిగా ఈ ఆందోళనలు తలెత్తినప్పటికీ ఏళ్ళ తరబడి ప్రజల్లో అసంతృప్తి కూడా బాగా పేరుకుపోయింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న సమస్యలను పరిష్కరించడంలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు పదే పదే విఫలం కావడం, విశృంఖలమైన అవినీతి, ఉపాధి అవకాశాలు కొరవడడం ఇవన్నీ కూడా ప్రజల్లో అసహనానికి, అసంతృప్తికి కారణాలయ్యాయి. మితవాద శక్తులు ముఖ్యంగా రాజరిక అనుకూల వాదులు, రాజవంశవాదులు, హిందూత్వ శక్తులతో సంబంధమున్న గ్రూపులు ఈ అసమ్మతి, అసంతృప్తిని అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నించాయి. రాచరికానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటూ పోరాడి ఎంతో కష్టపడి సాధించుకున్న రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచిన ప్రజాస్వామ్య, లౌకిక విలువలను పరిరక్షించుకోవడానికి జాగ్రత్త అవసరం.
పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రతిపక్ష పార్టీల ఉధృత నిరసనలు, ఆందోళనలకు సాక్ష్యంగా నిలిచాయి. బీహార్‌లోని ఎస్‌ఐఆర్‌పై ఏ విధమైన చర్చకు కూడా ప్రభుత్వం అనుమతినివ్వడానికి నిరాకరించింది. ఈ నిరసనల మధ్యే, కేంద్ర ప్రభుత్వం అనేక బిల్లులను ఆమోదించేసింది. వీటిలో గనులు, ఖనిజాలు (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాసే క్రీడా బిల్లులు సహా పలు బిల్లులు వున్నాయి. దేశ కీలకమైన ఖనిజ వనరులను దోచుకునేందుకు ప్రైవేటు, విదేశీ శక్తులను అనుమతించేలా తీసుకువచ్చిన సవరణ జాతీయ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద రక్షణ కల్పించబడిన గిరిజనుల భూములు వందలాది ఎకరాలను కూడా ప్రైవేటు కార్పొరేట్ దోపిడీకి అప్పగించేందుకు అనుమతించారు. దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం వుంది.
తీవ్రమైన అంశాలపై చర్చకు అనుమతించడానికి ప్రభుత్వం పదే పదే తిరస్కరించడం ఆ ప్రభుత్వ నియంతృత్వ స్వభావాన్ని తెలియచేస్తోంది. ఫలితంగా, ప్రజలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అనేక అంశాలు పార్లమెంట్‌లో సక్రమ చర్చకు నోచుకోలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల జీవనోపాధి సమస్యలను పార్లమెంట్‌లో చర్చించేలా పాత్ర పోషించాలి.
మహిళలు, దళితులు, ఆదివాసీలపై దాడులు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో మహిళలు, దళితులు, ఆదివాసీలపై పెరుగుతున్న దాడులను కేంద్ర కమిటీ చర్చించింది. మహిళలే. దళితులు, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న హింసకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతమవుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని ఆర్.జి.కార్, కోల్‌కతా లా కాలేజీ సంఘటనల్లోని బాధితులకు, అలాగే కర్ణాటకలోని ధర్మస్థల బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న పోరాటాలు, ఉద్యమాలకు కమిటీ మద్దతును ప్రకటించింది.
కార్మిక హక్కులపై దాడి
కార్మికులను మాత్రమే కాకుండా పర్యావరణాన్ని కూడా పరిరక్షించే వివిధ నియంత్రణ, ఆమోద ముద్ర నిబంధనలను బలహీనపరచడం ద్వారా కార్పొరేట్ల లూటీకి కేంద్రం వెసులుబాటు కల్పిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ ప్రసంగించిన వెంటనే, దూకుడుతో కూడిన ఆయన నయా ఉదారవాద విధానాలకు అనుగుణంగా, నియంత్రణా నిబంధనలను, సమ్మతిని తెలియచేసే అవసరాలను నేరరహితం చేయడానికి రెండు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు నిటి ఆయోగ్ ప్రకటించింది. ఇది, కార్మిక వర్గ హక్కులకు తీవ్రమైన ఎదురుదెబ్బ.
ట్రంప్ టారిఫ్ టెర్రరిజం
భారత్‌పై 50శాతం టారిఫ్‌లను అమెరికా ప్రకటించింది. వీటిలో 25శాతం టారిఫ్‌లు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చు కోవడంలో విఫలమైనందుకు ప్రకటించగా, మరో 25శాతం టారిఫ్‌లు రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నందుకు విధించారు. ఈ చర్య భారతదేశ వ్యవసాయాన్ని, మత్స్య పరిశ్రమను, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను, ముఖ్యంగా జౌళి పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీయనున్నాయి. మన దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధులు భారత్‌లో వున్నారు. అమెరికా ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం లొంగిపోరాదు. మన రైతులు, కార్మికులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రయోజనాలకు కట్టుబడి వుండాలి.
జమ్మూ కాశ్మీర్
ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును లెప్టినెంట్ గవర్నర్ దెబ్బతీస్తున్నారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కకు నెట్టేస్తున్నారు. తన విధులను నిర్వర్తించడానికి అనుమతించడం లేదు. జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను వ్యవస్థాగతంగా అణచివేస్తున్నారు. జమ్మూ, కాశ్మీర్, లడఖ్ మూడు ప్రాంతాల వ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తులు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించడమే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి గల ఏకైక మార్గం.
ఇజ్రాయిల్ దురాక్రమణను ఖండించాలి
గాజాపై ఇజ్రాయిల్ నిరంతరంగా దాడులకు పాల్పడుతునే వుంది. మరోవైపు వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై దాడులు చేసేందుకు, వారి భూములను అక్రమించుకునేందుకు ఇజ్రాయిలీ సెటిలర్లకు స్వేచ్ఛను ఇచ్చింది. గాజాలోకి ప్రవేశించే అన్ని రకాల మానవతాసాయంపై నిషేధం విధించింది. దీంతో గాజాలో ఆకలి కేకలు పెచ్చరిల్లాయి. ఆహారం లేక చిన్నారులు, వృద్దులు మరణిస్తున్న వార్తలు రోజూ కనిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో వార్తలను ఇచ్చే జర్నలిస్టులపై దాడులు కూడా ఉధృతమయ్యాయి. ఆస్పత్రులపై బాంబుల వర్షం కురుస్తోంది. మొత్తంగా గాజా నగరమంతా శిధిలాల కుప్పగా మారింది. అంతర్జాతీయ చట్టాలను, దౌత్య ప్రమాణాలను, నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ఇజ్రాయిల్, కాల్పుల విరమణ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతారపై దాడులకు పాల్పడింది. దీంతో మరోసారి పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి నెలకొనడాన్ని వ్యతిరేకించే ఒక దుష్ట దేశంగా ఇజ్రాయిల్ నిలిచింది. ఎటువంటి కాల్పుల విరమణ ప్రతిపాదనలను కూడా ఆమోదించకుండా వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకమై, చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.