మృతిపై విచారణ చేపట్టాలని డిమాండ్
వీసీ ఛాంబర్‌ను ముట్టడించిన విద్యార్ధులు
నవతెలంగాణ-ముధోల్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో బుధవారం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దాంతో ట్రిపుల్ ఐటీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బుధవారం ఉదయం హాస్టల్ గదిలో ప్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ కళాశాల అధికారులు మధ్యాహ్నం వరకు బయటకు పొక్కకుండా చూశారు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఆస్పత్రికి తరలించారు.
వనపర్తి జిల్లాకు చెందిన వసంత(21) వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. విద్యార్థిని రెండు రోజులుగా ముభావంగా ఉంటున్నట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థిని ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవటంతో ఈమె కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమా? మరేదైనా కారణమా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. విద్యార్థిని గొంతుపై గాయాలుండటంతో ఆత్మహత్యపై అనుమానాలున్నాయని విద్యార్థులు సాయంత్రం యూనివర్సిటీ వీసీ ఛాంబర్‌ను ముట్టడించారు. మృతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.



