– న్యాయ విచారణ చేయాలని కుటుంబసభ్యుల డిమాండ్
– నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం మాక్లూర్ తండా గురుకులంలో ఘటన
– కలెక్టర్ సీరియస్.. ప్రిన్సిపాల్ సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు
నవతెలంగాణ-డిచ్‌పల్లి
విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం గంగారం తండా పరిధిలోని మాక్లూర్ తండా వద్ద ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో మంగళ వారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థాని కులు, పోలీసులు, పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మకమర్ది గ్రామానికి చెందిన బానోత్ రామ్‌చరణ్ (15) ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం విద్యార్థి వద్ద సెల్‌ఫోన్ కనిపించడంతో టీచర్ మందలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. సాయంత్రం తోటి విద్యార్థులతో ఆటలు ఆడిన తర్వాత కొంతసేపటికి బాత్‌రూమ్‌కి వెళ్లిన రామ్‌చరణ్.. బట్టలు ఆరేసుకునే తాడుతో ఉరే సుకున్నాడు.అది గమనించిన తోటి విద్యార్థులు ప్రిన్సి పాల్ రమేష్‌కుమార్‌కు తెలిపారు. వెంటనే పాఠశాల సిబ్బంది రాంచరణ్‌ను చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించడంతో మృత దేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఇందల్‌వాయి ఎస్‌హెచ్‌వో జీ.సందీప్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకొని మృతి చెందినట్టు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. మృతుని తండ్రి బానోత్ నూర్‌సింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఎలాంటి అవాంచనీయ సంఘట నలు చోటుచేసుకోకుండా ఇందల్‌వాయి ఎస్‌హెచ్‌ఓ జీ సందీప్, డిచ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ మోహమ్మద్ అరీఫ్ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు.
సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలి : తండ్రి, కుటుంబ సభ్యుల డిమాండ్
నాలుగేండ్లుగా ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రామ్‌చరణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అందరితో కలిసి మెలిసి ఉండేవాడని, కానీ రెండు నెలలుగా పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లు తదితరులు కావాలని రాంచరణ్ పై కక్షగట్టి మానసిక ఒత్తిడికి, ఇబ్బందులకు గురి చేశారని మృతుని తండ్రి నూర్‌సింగ్, బంధువులు అరోపించారు. బుధవారం ఏకలవ్య పాఠశాలకు చేరు కుని వారు విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి ఆత్మహత్యపై తమకు పాఠశాల సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడంలేదని, తలో మాట మాట్లా డుతున్నారని తెలిపారు. ఒకరు బాత్‌రూమ్‌లో జారిపడినట్టు, మరొకరు బిల్డింగ్‌పై నుంచి పడ్డాడని, ఇంకొకరు బాత్‌రూమ్‌లో ఉరేసుకు న్నట్టు తెలుపుతున్నారని అన్నారు. అసలు అక్కడ చూస్తే బాత్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకోవడానికి స్థలమే లేదని, అది ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. తమకు బాలుని మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి, కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్
విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపి ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురిని సస్పెండ్ చేశారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారాంనాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ స్వామి, డాక్టర్ సైదా జైనబ్, ఫణికుమార్, డాక్టర్ జ్యోతి ప్రాథమికంగా విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. వీరి నివేదిక ఆధారంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్‌కుమార్, హౌజ్ మాస్టర్ కుల్దీప్ యాదవ్, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్‌చార్జి ఆకాష్ యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఇందల్‌వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులతో భేటీ అయి, రామ్‌చరణ్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామ్‌చరణ్ ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తంచేశారు. జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు దరిచేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్‌సీవో గంగారాం నాయక్ తదితరులు ఉన్నారు.



