– ప్రమాదమా, ఆత్మహత్యా అనే అనుమానం?
– పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటున్న విద్యార్థి సంఘాలు
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి వివేక్ (14) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నంగునూరు మండల కేంద్రానికి చెందిన వివేక్.. ఐదవ తరగతి నుంచి గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. దసరా పండుగ సెలవులకు ఇంటికి వెళ్ళిన వివేక్‌ను తండ్రి సత్యనారాయణ సోమవారం హాస్టల్‌లో దించి వెళ్లాడు. మరుసటి రోజు ఉపాధ్యాయులు ఫోన్ చేసి మీ అబ్బాయికి దెబ్బలు తాకాయని చెప్పి రమ్మన్నారని, వచ్చి చూసే సరికి వివేక్ మృతి చెందిన విషయం తెలిసిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ కారిడార్‌లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు మెడకు తాడు చుట్టుకొని విద్యార్థి వివేక్ మృతి చెందినట్టు ఉపాధ్యాయులు తెలుపుతుండగా, విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం ఆత్మహత్య అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది చదువుతున్న పాఠశాలలో ఇంత నిర్లక్ష్యంగా ఉపాధ్యాయులు వ్యవహరించడం సరికాదని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి మృతి పట్ల పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి మృతి చెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES