Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యార్థుల సమస్యలే ప్రధాన ఎజెండా

విద్యార్థుల సమస్యలే ప్రధాన ఎజెండా

- Advertisement -

హెచ్‌సీయూ లెఫ్ట్‌ దళిత, బహుజన, గిరిజన కూటమి లక్ష్యం
విద్యారంగ పరిరక్షణే ధ్యేయం
కేంద్ర ప్రభుత్వ తిరోగమన విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల పరిరక్షణకు ప్రత్యేక ఉద్యమం
హెచ్‌సీయూలో నేడు స్టూడెంట్‌ యూనియన్‌ ఎన్నికలు

నవతెలంగాణ-మియాపూర్‌
మరోసారి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రగతిశీల శక్తులదే విజయం అని లెఫ్ట్‌ బహుజన, దళిత, గిరిజన ఫ్రంట్‌ విద్యార్థి సంఘం నాయకులు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌, ఏబీవీపీ ఎన్ని కుట్రలు పన్నినా విద్యార్థులు తమ వైపే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్‌యూసీలో జరిగిన గత ఎన్నికల్లో ప్రగతిశీల ఫ్రంట్‌ విజయం సాధించింది. అయితే ఈ పాలకవర్గానికి సమయం ఉన్నప్పటికీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌ విద్యార్థి సంఘాన్ని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం హెచ్‌సీయూలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా లెఫ్ట్‌ బహుజన, దళిత, గిరిజన ఫ్రంట్‌ పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. ఏబీవీపీతో కలిసి యూనివర్సిటీ యాజమాన్యం చేస్తున్న కుట్రలను విద్యార్థులకు వివరించింది. విద్యార్థి సంఘం పాలకవర్గ సమయం ఉన్నప్పటికీ రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ సారి ఎన్నికల్లో కూడా మళ్లీ విజయఢంకా మోగించి.. ప్రత్యర్థి సంఘం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో ప్రచారం కూడా చేపట్టింది. ఈ సందర్భంగా లెఫ్ట్‌ బహుజన, దళిత, గిరిజన ఫ్రంట్‌ విద్యార్థి సంఘం నాయకులు ‘నవతెలంగాణ’తో మాట్లాడారు. తమ ఎజెండాను విద్యార్థి లోకం ముందు పెట్టినట్టు నాయకులు తెలిపారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు పన్నుతోందన్నారు. విద్యార్థి వ్యతిరేక విధానాలపై తమ కూటమి భవిష్యత్తులో విద్యార్థుల తరపున పోరాటం నిర్వహిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం గతంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తుంటే, ఏబీవీపీ మాత్రం తన మతోన్మాద ఎజెండాతో విద్యార్థులను చీల్చే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక ఉద్యమం తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం పేద, మధ్యతరగతి కుటుంబాలకు పూర్తిగా విద్యను దూరం చేసే విధంగా ఉందన్నారు. కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా దేశంలో విద్యా వ్యవస్థను మారుస్తూ ప్రయివేటీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న విధానాలపై పోరాడుతామని తెలిపారు. తమ పోరాటానికి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు తమ ఓటు ద్వారా మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు.

పోటీలో ఉన్న లెఫ్ట్‌ బహుజన, దళిత, గిరిజన ఫ్రంట్‌ ప్యానెల్‌
అధ్యక్షులు : అనన్య దాష్‌
వైస్‌ ప్రెసిడెంట్‌ : దివాకర్‌
ప్రధాన కార్యదర్శి : ఎం. శశి ప్రీతం
జాయింట్‌ సెక్రటరీ : మూడ్‌ నవీన్‌ కుమార్‌
సాంస్కృతిక కార్యదర్శి : తొర్తి శరత్‌
క్రీడా కార్యదర్శి : అల్తాఫ్‌
జీఎస్‌సీఎస్‌హెచ్‌ (ఇంటిగ్రేటెడ్‌) : అనన్య పివి
జీఎస్‌సీఎస్‌హెచ్‌ (పీజీ) : కంది పూజిత

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -