ఉస్మానియా వేదికగా సీఎం స్పష్టంగా ప్రకటించాలి : రాష్ట్రవ్యాప్త కార్యాచరణకు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహించాలనీ, ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 10న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే సభలో తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటన చేసి విధి విధానాలు ప్రకటించాలని వామపక్ష విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ”తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు – ఆవశ్యకత” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పృథ్వీ, ఎఐడీఎస్‌ఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు నీతీష్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎ.సాంబ జార్జిరెడ్డి, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వర్ రావు, పీడీఎస్‌యూ విజృంభణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పవన్, తెలంగాణ యువజన సంఘం శశంకార్ మాట్లాడారు.గతంలో జరిగిన హింసాత్మక ఘటనలతో గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థి సంఘాల ఎన్నికలను రాష్ట్రంలో నిషేధించారని వారు తెలిపారు. దీంతో రాజకీయాల్లోకి విద్యావంతుల రాక తగ్గిపోతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. హింస నెపంతో విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణను నిరాకరిస్తున్న వారే… సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా సార్వత్రిక ఎన్నికలను ఎలా నిర్వహిస్తున్నారని వారు ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో ఎన్నికల నిర్వహణతో విద్యార్థుల చదువులకు ఇబ్బందులు కలుగుతాయన్న వాదననూ వారు కొట్టిపారేశారు. జెఎన్‌యూ, హెచ్ సీయూలలో ఎన్నికలు జరగటం లేదా? ఆ యూనివర్సిటీల్లో విద్యార్థులు చదువుల్లో రాణించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ విద్యా కమిషన్ తన సిఫారసుల్లో యూనివర్సిటీలలో ఎన్నికలు నిర్వహించాలని తెలిపిందనీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తానే గతంలో ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన సభలో విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలనీ, అప్పుడే రాజకీయ వ్యవస్థలో అభివృద్ధి, ప్రజాసేవ చేసే రాజకీయాలు ఉంటాయని ప్రకటించారని గుర్తు చేశారు.
విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఉంటే విద్యా సంస్థలలో ఫీజుల పెంపు, మౌలిక సదుపాయాలు , హాస్టల్స్ సదుపాయాలు, విద్యార్థినుల సమస్యలు, సైద్ధాంతిక అంశాలపై చర్చ జరిగి సమస్యలు పరిష్కారం అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక అభివద్ధికి ఆటంకంగా ఉన్న డ్రగ్స్, సోషల్ మీడియా లాంటి అంశాలపై చర్చలు కులం, మతం, దేశ అభివృద్ధి రాజ్యాంగ పరిరక్షణ లాంటి చర్చలు నిరంతరం జరుగుతాయని, విద్యార్థులు రాజకీయాల్లో రాణిస్తారని తెలిపారు. సామాజికంగా వెనుకబడిన తెలంగాణ రాష్ట్రానికి దేశ ప్రజాస్వామ్యానికి విద్యార్థి సంఘం ఎన్నికలు కీలకమని వారు అభిప్రాయపడ్డారు.
ఎన్నికలు నిర్వహించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామనీ, దాని కోసం వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య పోరాట కార్యచరణ రూపొందిస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, వీసీకే నాయకులు తెలంగాణ శ్యాం పాల్గొని విద్యార్థి సంఘాల డిమాండ్‌కు మద్ధతు తెలిపారు. వెంటనే రాష్ట్ర యూనివర్సిటీల్లో ఎన్నికలకు ప్రభుత్వం పూనుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, జె.రమేష్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేందర్, శ్రీమాన్, స్టాలిన్, జార్జిరెడ్డి పీడీఎస్‌యూ హైదరాబాద్ కార్యదర్శి అంజి, ఏఐడీఎస్‌ఓ హైదరాబాద్ నాయకులు నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా నాయకులు కైలేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



