– రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేత
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని నారంవారిగూడెం పంచాయితి కొత్తూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం పేద కుటుంబాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. కిన్నెర శ్రీను నివాస గృహం పూర్తిగా దగ్ధమై, కుటుంబం సర్వం కోల్పోయి నిరాశ్రయంగా మారింది.
ఈ ఘటనపై మానవీయంగా స్పందించిన అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు సహాయహస్తం చాపారు. బాధిత కుటుంబానికి చెందిన శ్రీను కుమారుడు నందకిషోర్ అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సహ విద్యార్థి పరిస్థితిని తెలుసుకున్న తోటి విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పాకెట్ మనీని సేకరించారు.
విద్యార్థుల ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయులు కూడా తోడయ్యారు. ఇలా సేకరించిన రూ.10,000 నగదును బుధవారం బాధితుని ఇంటికి వెళ్లి నందకిషోర్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు కుటుంబానికి ధైర్యం చెప్పి,అవసరమైన సహాయానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్‌కే సహినాబేగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మానవీయ కోణం ఏమిటంటే..
అగ్నిప్రమాదం తో కష్టాల్లో ఉన్న సహచరుడి కుటుంబానికి చిన్న వయసులోనే విద్యార్థులు చూపిన సానుభూతి,త్యాగం అభినందనీయం.సమాజంలో ఇంకా మానవత్వం సజీవంగా ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. అయితే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా చర్యలు,తక్షణ సహాయక వ్యవస్థలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.



