నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజీళ్ళ మాస్టారుగా ప్రసిద్ధి గాంచిన అంది అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగ అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో పాఠశాలల్లో విద్యార్ధులతో గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతుందన్నారు. ఈ తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగ అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. సూపర్ బ్రెయిన్ యోగ అనేది గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని తెలిపారు.
తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని తెలిపిన ఆయన ఆ పరిశోధనా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు.క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్యా పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మక, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందన్నారు. సూపర్ బ్రెయిన్ యోగాను మార్కుల యోగాగా అందే జీవన్ రావు అభివర్ణించారు. విద్యార్థులు సూపర్ బ్రెయిన్ యోగాను ప్రతి నిత్యం చేయడం ద్వారా తెలివితేటలు పెరిగి అత్యధిక మార్కులు సాధించవచ్చని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన రోజంతా పదునైన మనసుతో రోజువారి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటారన్నారు.
ఈ ఆధునిక ప్రపంచంలో వాతావరణ కాలుష్యం, ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే రేడియేషన్ వలన పీనియల్ గ్రంథి పని తీరు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వీటికి తోడు మానసిక ఒత్తిడి, పోషకాల అసమతుల్యతలు కూడా పీనియల్ గ్రంథి పనితీరు పై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వలన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి జీవ గడియారం గతి తప్పుతోందని, మన శరీరంలోని జీవ క్రియలను నియంత్రించే జీవ గడియారం సరిగా పని చేయాలంటే పీనియల్ గ్రంథి చురుకుగా ఉండాలని తెలిపారు. తీరిక లేని మన జీవితంలో ఈ విపత్తుకు సూపర్ బ్రెయిన్ యోగాయే సరియైన పరిష్కారమని స్పష్టం చేశారు.బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చి, ప్రతిరోజు ప్రార్ధనా సమయంలో విద్యార్థులచే సూపర్ బ్రెయిన్ యోగాను చేయించడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చు అన్నారు.
తాను సూపర్ బ్రెయిన్ యోగా పై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. తాను రాష్ట్ర, అంతర్జాతీయ సదస్సులలో సూపర్ బ్రెయిన్ యోగ అంశంపై సమర్పించిన పరిశోధన పత్రాల ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్నకు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన పది సంవత్సరాల తర్వాత కూడా అందే జీవన్ రావు సమాజానికి ఉపయోగపడే సూపర్ బ్రెయిన్ యోగా అంశపై పరిశోధన కొనసాగిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనడం అభినందనీయమని ఐకేపి, సేర్ఫ్ రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అందే జీవన్రావును పాఠశాల తరఫున శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయులు వేముల నాగ భూషణం, ఉపాధ్యాయులు లక్ష్మి నరసయ్య, రాజేశ్వర్ గౌడ్, మహేష్, రాజేశ్వర్, సరోజన లక్ష్మి, స్వర్ణ లత, కవిత, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
సూపర్ బ్రెయిన్ యోగపై విద్యార్థులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES