విద్యార్థుల్లో సృజనాత్మకత, నైతిక విలువలు నేర్పించాలి
విద్యార్థులకు సమస్యలు ఉంటే ఫిర్యాదు బాక్సుల్లో వేయాలి
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి
విద్యార్థుల పట్ల ఆప్యాయత, అనురాగాలతో వ్యవహరించి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో విద్యనందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి మండలం చిట్యాల గ్రామ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు విద్యార్థులతో ముచ్చటించారు. చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయని వాటిని పరిష్కరించడంతో పాటు విహారయాత్రలకు తీసుకువెళ్ళడం, తరచుగా క్రీడలు ఆడించడం వంటివి చేయాలని విద్యార్థులు కోరారు.
స్పందించిన కలెక్టర్ ఉపాధ్యాయులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని విద్యార్థులకు భరోసా కల్పించారు. పాఠశాలలో విద్యార్థులకు ఏ సమస్య వచ్చిన ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులో వేయాలని సూచించారు. అనంతరం గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని, విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు ప్రేమ అభిమానం చూపించాలని ఆదేశించారు. క్రీడల్లో రాణించే విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టిపెట్టి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రావడానికి సహకరించాలన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహఫంక్తి మధ్యాహ్న భోజనం చేశారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, ఎమ్మార్వో రమేష్ రెడ్డి, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.