అనురాగ్ యూనివర్సిటీ డైరెక్టర్ డా. మహీపతి శ్రీనివాస్
– బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పురస్కారాలు
నవతెలంగాణ – ముషీరాబాద్
విద్యార్థులు శాస్త్రీయ విద్యను అలవర్చుకున్నప్పుడే తమ భవిష్యత్‌ను తామే తీర్చిదిద్దుకోగలుగుతారని అనురాగ్ యూనివర్సిటీ డైరెక్టర్ డా. మహీపతి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివి 500, ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులకు తెలంగాణ బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదువుకున్నప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ఇష్టం లేని చదువులకు బలవంతంగా పంపించడం వల్ల చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని, ఫెయిల్ అవుతున్నారని, మానసికంగా కుంగిపోతున్నారని చెప్పారు. ఏ గ్రూపులో అడ్మిషన్ తీసుకున్నా కష్టపడి చదివితే భవిష్యత్ బాగుంటుందని, సమయం వృథా కాకుండా ఉంటుందని సూచించారు. ఎంత కష్టం అనిపించినా ఆ కష్టాన్ని మరిచిపోయి ఏ విషయాన్ని ఏ పద్ధతిలో చదివితే సులువుగా అర్థమవుతుందో అధ్యాపకులు, అనుభవమున్నవారి వద్ద సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. నేడు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురైన తరగతుల వారే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, అలా కష్టపడి చదువుకొని మంచి మార్కులు సాధించిన వారంతా గొప్ప విద్యార్థులేనని కొనియాడారు.
విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షులు టి.రమేష్ మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల నుంచే ప్రయివేటు విద్యాసంస్థలు వచ్చాయి తప్ప అంతకుముందు మేధావులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారేనని తెలిపారు. ఐన్‌స్టీన్, లుథర్‌ఫర్డ్, థామస్ అల్వా ఎడిసన్ వంటి అనేక మంది శాస్త్రజ్ఞులు, ప్రపంచ మేధావులు ఎటువంటి సౌకర్యాలు లేని కాలంలో స్వయంగా కష్టపడి శాస్త్ర పరిశోధనలు చేసి నేడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారన్నారు. భారతదేశంలో అంబేద్కర్ అనేక అవమానాలకు గురవుతూ చదువుకున్నారని గుర్తు చేశారు. ప్రతి విషయాన్నీ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించుకోవాలని, తరగతి గదిలో అధ్యాపకులను ప్రశ్నించాలని సూచించారు.
బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.సోమయ్య మాట్లాడుతూ.. తెలంగాణ బాలోత్సవం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం అని చెప్పారు. ఈ మేరకు గత నెలలో 7, 8, 9 తరగతులలో ప్రావీణ్యం చూపించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇచ్చామని, ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులకు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఏడాదీ పదివేల మందికిపైగా విద్యార్థులకు దాదాపు 30 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నవంబర్‌లో నిర్వహించే బాలోత్సవాల్లో మీరంతా పాల్గొనాలని సూచించారు. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా గర్ల్స్ ఎంపవర్‌మెంట్ డ్రాఫ్ట్ తయారవుతుందని, ఈ సంవత్సరం నుంచి బాలికల భవిష్యత్, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బాలోత్సవం కమిటీ అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా.. సభ్యులు సుజావతి, మమత, రూప రుక్మిణి, అంకమ్మ, మహేష్ దుర్గే, ఆఫీస్ సెక్రటరీ బ్రాహ్మణి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.