నవతెలంగాణ – ఆలేరు రూరల్
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ అన్నారు. గురువారం సీఎం కప్ సెకండ్ ఎడిషన్‌లో భాగంగా ఆలేరు నియోజకవర్గస్థాయి క్రీడోత్సవాలు ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్ సభ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈఓ మాట్లాడుతూ… క్రీడాకారులు ప్రతిరోజూ సాధన చేస్తూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు.
మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, క్రీడలను వృత్తిగా ఎంచుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహించారు. ఈ క్రీడోత్సవాల్లో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు,రెండు మున్సిపాలిటీలకు చెందిన దాదాపు 650 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి, నియోజకవర్గంలోని వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



