– సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్
నవతెలంగాణ -రాజన్న సిరిసిల్ల
విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి గీతే, ఎమ్మెల్సీ అంజి రెడ్డిలతో కలిసి సైకిళ్ళు పంపిణీ చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ విద్యా, వైద్యం రూపంలో రాజకీయాల కతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మోడీ గిఫ్ట్ పేరిట 10వ తరగతి చదివే బాల బాలికలకు ఉచితంగా సైకిల్ అందిస్తున్నామని అన్నారు.
విద్యార్థులకు మొదటి ఆస్తి సైకిల్ అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సైకిల్స్ అందించామని అన్నారు.నాణ్యమైన సైకిల్ అందిస్తున్నామని, వీటిని వినియోగించి విద్యార్థులు సకాలంలో తరగతి గదులకు హాజరు కావాలని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాలలో కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు మోడీ గిఫ్ట్ కింద సైకిల్స్ అందిస్తామని అన్నారు. ఎల్.కే.జి నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు మోడి కిట్స్ పేరిట బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర సామాగ్రి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్ద పెద్ద కంపెనీలు వివిధ పనులపై వచ్చినప్పుడు వారితో చర్చించి సీ.ఎస్.ఆర్. నిధుల ద్వారా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ నిబద్ధతతో పని చేస్తున్నారని అన్నారు. యూ.పి. రాష్ట్రానికి చెందిన కలెక్టర్, మహా రాష్ట్ర కు చెందిన ఎస్పీ క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికతో కృషి చేయడం వల్ల గొప్ప స్థాయికి ఎదిగామని అన్నారు. విద్యార్థులు ఉదయం సమయంలో చదువుకోవాలని, మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు.
ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు సైకిల్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు ఇన్చార్జి డిఈఓ వినోద్ కుమార్, స్థానిక నాయకులు, విద్యార్థులు, ప్రజలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.