జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు
ఘనంగా హోలిమేరి ఇంజినీరింగ్ కాలేజీ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హోలిమేరి ఇంజినీరింగ్ కాలేజీ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలను శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు సమస్యలను అధిగమించేలా, ఒత్తిడిని జయించేలా చదవాలని సూచించారు. నానో సొల్యూషన్స్ పుస్తకం చదివాననీ, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందనీ, విద్యార్థులందరూ చదవాలని కోరారు. స్థిరమైన అభిప్రాయాలతో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ది ఇండస్ ఎంటర్‌ప్రైజెస్ గ్లోబల్ చైర్మెన్ మురళి బుక్కపట్నం మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలను బాగా చదివి జ్ఞానం పెంచుకోవాలన్నారు. శ్రమను గౌరవించే లక్షణాలను అలవర్చుకోవాలని చెప్పారు.
జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కష్టపడే తత్వాన్ని విద్యార్థి దశ నుంచే నేర్చుకోవాలని సూచించారు. ఇందిరాగాంధీ, అబ్దుల్‌కలాం వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాబురావు కూచిపూడి మాట్లాడుతూ విద్యార్థులు యూపీఎస్సీ పరీక్షలు రాయాలనీ, ఐఏఎస్, ఐపీఎస్‌లుగా కావాలని కోరారు. హోలిమేరి ఇంజినీరింగ్ కాలేజీ వ్యవస్థాపక చైర్మెన్ అరమంద వరప్రసాద్‌రెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి అరిమంద విజయశారదారెడ్డి, చైర్మెన్ అరిమండ సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ 2001లో ఈ కాలేజీని ప్రారంభించామని గుర్తు చేశారు. దీన్ని త్వరలోనే విశ్వవిద్యాలయంగా స్థాపించడం తమ ఆకాంక్ష అని చెప్పారు. స్పోర్ట్స్ అకాడమిని స్థాపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ పరిటాల చంద్రశేఖర్, డైరెక్టర్ ప్రీతిరెడ్డి, ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా గ్రూప్ ఎండీ జి శ్రీనివాసరాజు, జనప్రియ సీఈవో సత్యరాజు వక్కలంక, ఆలిండియా రోబోటిక్స్ అసోసియేషన్ చైర్మెన్ కృష్ణ పీఎస్‌వీ, గ్రోత్ స్ట్రాటజీ డైరెక్టర్ భానురెడ్డి తదితరులు పాల్గొన్నారు.



