– మండల స్థాయి టాలెంట్ టెస్ట్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల విద్య వనరుల కేంద్రంలో గురువారం రాష్ట్రీయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు, హిందీ భాషలలో ప్రతిభా పాటవ పరీక్షలను నిర్వహించారు. మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య పర్యవేక్షణలో విద్యార్థులకు తెలుగు, హిందీలో ఈ ప్రతిభ పాటవ పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రతిభ పాటవ పరీక్షల్లో భాగంగా తెలుగు విభాగంలో కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి జి.అభినయ్ మొదటి స్థానం సాధించగా, చౌట్ పల్లి పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎస్.ప్రణవి, సిహెచ్.మధు శ్రీ ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు.
అదేవిధంగా హిందీ విభాగంలో కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని జి.శాన్విక ప్రథమ స్థానంలోనిలువగా, చౌట్ పల్లి పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎస్.ప్రణవి ద్వితీయ స్థానం, కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎండీ.ఫాతిమా ఫిర్దోస్ తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య మాట్లాడుతూ ఉత్తరలో జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో మండలంలోనే కాకుండా జిల్లాలోనే అత్యధిక మార్కులు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, హిందీ పండిత పరిషత్ ఉపాధ్యక్షులు వరప్రసాద్, అన్ని పాఠశాలల హిందీ, తెలుగు భాషోపాధ్యాయులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



