– పసుపు పంట సాగుపై అవగాహన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, పసుపు పరిశోధన స్థానాన్ని ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ సాంగ్ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన మైక్రో బయాలజీ, వృక్షశాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థినిలు, అధ్యాపక బృందం సభ్యులు సోమవారం సందర్శించారు. పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థినులకు పసుపు పంట సాగు, పరిశోధన కేంద్రంలో పరిశోధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పసుపు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పసుపు పంటపై జరుగుతున్న వివిధ పరిశోధనలు, ఆధునిక సాగు పద్ధతులు, పసుపు రకాల ప్రదర్శన (ఎగ్జిబిషన్), పంట ఉత్పత్తి పెంపు పద్ధతుల గురించి విద్యార్థినులకు, అధ్యాపక బృందానికి వివరించారు. పరిశోధన కేంద్రాన్ని సందర్శించడం పట్ల విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. సందర్శనలో భాగంగా తాము నేర్చుకున్న అంశాలు తమకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రకళ, వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు చైతన్య శాంతి, పుష్పాంజలి, కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విద్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



