నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూరు గ్రామ శివారులో గల క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ( పాలిటెక్నిక్), డి ఈ ఈ ఈ డిప్లమా విభాగం విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ (పంప్ హౌజ్, పోచంపాడ్) ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆనకట్ట నిర్మాణ విధానం, నీటి ప్రవాహ నియంత్రణ వ్యవస్థలు, పంపింగ్ స్టేషన్ల పనితీరు, విద్యుత్ ఉత్పత్తి విధానం వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రయోగికంగా అవగాహన పొందారు. ఈ విజిట్ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలపై మరింత స్పష్టత లభించడంతో పాటు పరిశ్రమలపై అవగాహన మరింత పెరిగింది.
ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ డిప్లమా కోఆర్డినేటర్ శ్రీ సుజీత్ మాట్లాడుతూ,ఇలాంటి ఇండస్ట్రియల్ విజిట్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను అందించి, క్లాస్‌రూమ్‌లో నేర్చుకునే సిద్ధాంతాలను వాస్తవ ప్రాజెక్ట్‌లతో అనుసంధానించుకునే అవకాశం కల్పిస్తాయి. ఇది భవిష్యత్ ఇంజినీర్లకు ఎంతో ఉపయోగకరం” అని తెలిపారు.
ఏ ఈ రామకృష్ణ ,సీనియర్ ఫోర్ మెన్ ఎం.డి. రఫీఖ్ మాట్లాడుతూ,విద్యార్థులు చదువుతో పాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా చూసినప్పుడే పూర్తి అవగాహన కలుగుతుంది. ఈ తరహా సందర్శనలు వారి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిస్తాయి” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ అల్జాపూర్ దేవేందర్ , ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కట్కం శ్రీనివాస్ ఏవో బి. నరేందర్ , డి ఈ ఈ ఈ విభాగాధిపతి ఫాతిమా, అధ్యాపకులు శివకృష్ణ, దేవరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.



