– బంగారు, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి మెడల్స్ సాధించిన విద్యార్థులను సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఘనంగా సన్మానించారు. ఈనెల 24,25 తేదీలలో మెదక్ జిల్లా మనోహరాబాద్ లో జరిగిన 10వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని తాటిపల్లి రిషిత, గోల్డ్ మెడల్ సాధించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు మెదక్ జిల్లా మనోహరాబాద్ లోనే జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలుర అండర్-16 సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో 9వ తరగతి విద్యార్థి కొత్తపల్లి సూర్యవర్మ, గోల్డ్ మెడల్ సాధించాడు.
అదేవిధంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 బాలికల విభాగంలో పాఠశాలకు చెందిన భవ్య శ్రీ, సిల్వర్ మెడల్ సాధించింది. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన ముగ్గురు విద్యార్థులను, విద్యార్థుల విజయానికి నిరంతరం కృషి చేసి సహకరించిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం, సాఫ్ట్‌బాల్ సీనియర్ ప్లేయర్ రాహుల్ ను పాఠశాల ప్రార్థన అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి పథకాలు సాధించడం ద్వారా పాఠశాలకు గర్వకారణంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు రమాకుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



