భూపరిహారం నిర్ణయంలో ఉదారంగా వ్యవహరించండి
నూతన మున్సిపల్ పాలకమండళ్లతో త్వరలో సమావేశం
వారికోసం ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం
మున్సిపాల్టీల్లో ప్రకటనల ఆదాయం పెంచండి
మల్టీలెవల్ పార్కింగ్, స్కైవాక్ మార్కెట్లపై స్టడీ చేయండి
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : సమీక్షా సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డేటా సెంటర్లకు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు, వారికి అవసరమైన భూమి, ఇతర వసతులపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. డేటా సెంటర్లకు భూ కేటాయింపులో హేతుబద్ధత ఉండాలనీ, వీటికోసం వివిధ ప్రాంతాల్లో కల్పిస్తున్న మౌలిక వసతుల కల్పన, భూ సేకరణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ పరిహారం నిర్ణయం విషయంలో ఉదారంగా ఉండాలని సూచించారు. రైతులను పిలిచి మాట్లాడి వారు సంతృప్తి చెందేలా పరిహారం నిర్ణయించాలని చెప్పారు. రూ.వేల కోట్లతో పెట్టుబడులు పెట్టే సంస్థలు భూమిపై పెట్టే పెట్టుబడి చాలా స్వల్పమనీ, కంపెనీలకు సకాలంలో భూమి, ఇతర వసతులు అందుబాటులో ఉంచితే త్వరగా పనులు పూర్తి చేసుకుంటారని అన్నారు.
అనంతరం ఆయన పురపాలకశాఖపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు ఆర్వీ కర్ణన్, సృజన, వినయకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మెన్లు, డిప్యూటీ చైర్మెన్లతో త్వరలో ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలను వారికి వివరించాలని సూచించారు. తాను స్వయంగా ఆ సమావేశానికి హాజరై, నూతనంగా ఎన్నికైన వారితో మాట్లాడాతానని తెలిపారు.పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ఆయన అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. మున్సిపాల్టీల్లో ప్రకటనల ఆదాయం పెంచుకోవాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో మల్టీలెవల్ పార్కింగ్, స్కైవాక్ మార్కెట్లపై అధ్యయనం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రాజధాని హైదరాబాద్‌లో నూతనంగా ఏర్పడిన గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ల పరిధిలో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తానే స్వయంగా ఆయా మున్సిపాల్టీల్లో ప్రత్యక్ష పరిశీలనకు వస్తానన్నారు. ఎక్కడైనా చెత్త కనపడితే సహించేది లేదనీ, విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుధ్య నిర్వహణ పరిశీలన కోసం ఆయా నగర పాలక సంస్థల కమిషనర్లు తెల్లవారు జామున ఆరు గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రకటనల ఆదాయం పెంపుదల పాలసీపై మాట్లాడుతూ నగరంలో కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలనీ, ఎలక్ట్రిక్, ఇతర కేబుళ్లు, సీసీ కెమెరాలు, ప్రకటనల బోర్డులు వాటిపైనే ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. హైదరాబాద్ సిటీలో ప్రయివేటు భూముల్లోనూ మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు.
నెక్లెస్ రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ముంబయి, అహ్మదాబాద్, బెంగళూర్‌ల్లోని ప్రకటనల ఆదాయంతో నగరంలో వస్తున్న ఆదాయాన్ని సరిపోల్చాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రకటనలకు 10 శాతం బోర్డులు కేటాయించాలన్నారు. ఈ సందర్భంగా పీపీపీ, ఇతర నమూనాల్లో ఆదాయం సమకూర్చుకునే అంశంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ సిస్టమ్ అనుసరించాలని అధికారులను ఆదేశించారు. పార్కుల వివరాలు సేకరించాలనీ, వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అంతకుముందు జరిగిన డేటా సెంటర్ల సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.



