ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్
నవతెలంగాణ – బాల్కొండ
ఆంగ్ల భాషను అభ్యసిస్తే అన్ని రంగాల్లో రాణిస్తామని విద్యార్థులకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ సూచించారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఈఎల్టిఎ నిజామాబాద్ జిల్లా శాఖ,ఎస్సిఈర్టి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంగ్లభాషా జిల్లా స్థాయి పోటీల్లో, రెసిడెన్షియల్ కేటగిరీలో బాల్కొండ ఆదర్శ పాఠశాల విద్యార్థులు మొదటి, రెండవ స్థానాలను కైవసం చేసుకొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని మంగళవారం ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని మోడల్, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి పాల్గొన్న విద్యార్థులతో పోటీ పడి ఆదర్శ పాఠశాల విద్యార్థులు విజయం సాధించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విజేతలైన ఏంజలీనా, రశ్మిత, మనస్విక, కష్వాలను అభినందించారు.ఆంగ్లభాషను అభ్యసిస్తే అన్ని రంగాల్లో రాణించే అవకాశాలు విస్తృతంగా ఉంటాయని, విద్యార్థులు భాషాపరమైన పట్టు పెంచుకోవడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవాలని సూచించారు. విద్యార్థుల విజయానికి ముఖ్య పాత్ర పోషించిన గైడ్ టీచర్ శ్రీనివాస్ రాజును ప్రత్యేకంగా అభినందించారు.ఆదర్శ పాఠశాల విద్యార్థులు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తుండటం ఆనందకరమని, విద్యార్థుల అభివృద్ధికి ఎల్లప్పుడూ పాఠశాల పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దత్తు, ఎ.వి. గణేష్, సుకుమార్, శ్రావణి, విజయలక్ష్మి, శ్రీకాంత్, భీమరాజ్, లక్ష్మీనారాయణ, రవి, రేష్మ తదితరులు పాల్గొన్నారు.



