ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య 1,259వ రోజులో ప్రవేశించింది. ఆగస్టు ఎనిమిదిలోగా శాంతి ఒప్పందానికి రానట్లయితే ఆంక్షలను మరింత తీవ్రం గావిస్తామని డోనాల్డ్ ట్రంప్ బెదిరించాడు. ఈ పూర్వరంగంలో రెండు దేశాలూ పరస్పరం అణ్వాయుధాలున్న జలాంతర్గాములను మోహరించేం దుకు నిర్ణయించాయి. రష్యా చమురు కొనుగోలు వ్యవ హారంలో చైనాతో భారత్ చేతులు కలిపిందని, ఈ లావాదేవీలతో రష్యాకు ఆర్థికంగా తోడ్పడుతున్నట్లు వైట్‌హౌస్ సిబ్బంది ఉప అధికారి స్టెఫాన్ మిలర్ ఆరోపించాడు. ఈ తీరు అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ లావాదేవీల వ్యవహారాన్ని చూస్తే జనాలు దిగ్భ్రాంతి చెందుతారని ఆదివారంనాడు ఫాక్స్‌న్యూస్‌తో చెప్పాడు.తన ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కోఫ్ బుధ లేదా గురువారాల్లో మాస్కో సందర్శించనున్నట్లు ట్రంప్ ఆదివారం నాడు చెప్పాడు. వారంతా జిత్తుల మారి మనుషులు, వారికి ఆంక్షలను తప్పించుకోవటం తెలుసు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. చైనా, రష్యా నౌకాదళాలు జపాన్ సముద్రంలో నిర్ణీత కార్యక్రమం మేరకు విన్యాసాలు జరుపుతున్నాయి. అవసరమైన చోట రెండు అణుజలాంతర్గాములను మోహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత రెండు రోజుల పాటు ఇవి జరుగుతున్నాయి. ఎంతో ముందుగానే ఈ విన్యాసాల తేదీలను ప్రకటించినందున తాము అవసరమైతే సన్నద్దంగా ఉన్నట్లు బెదిరించేందుకు ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది.
తాము అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి(ఎన్‌పిటి) పూర్తిగా కట్టుబడి ఉన్నామని, వాటి గురించి మాట్లాడే ముందు అమెరికా సంయమనం పాటించాలని రష్యా ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్ సోమవారం నాడు హితవు పలికాడు. తమ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసినప్పటికీ సోవియట్ కాలం నుంచి కొనసాగుతున్న విధానం ప్రకారం చివరి యత్నంగా అణ్వస్త్రాలను ప్రయోగించక తప్పదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ గురువారం నాడు హెచ్చరించాడు. దాన్ని అవకాశంగా తీసుకున్న ట్రంప్ రెండు జలాంతర్గాములను మోహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శుక్రవారం నాడు చెప్పాడు. అవి ” తగిన ప్రాంతాలలోనే ” ఉన్నాయని ఆదివారం నాడు మరో ప్రకటన చేశాడు. అయితే ఇదేమీ కొత్త కాదని, నిర్ణీత కార్యకలాపాల్లో భాగంగా అవి ఎప్పుడూ మోహరించే ఉంటాయని పెష్కోవ్ చెప్పాడు. తాజా పరిణామాలపై అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అణు యుద్ధంలో విజేతలంటూ ఉండరని, అయితే సమరమే తలెత్తితే తాము పూర్తి సన్నద్దంగా ఉన్నామని పెష్కోవ్ చెప్పాడు.
అమెరికా దగ్గర మూడు రకాల జలాంతర్గాములున్నాయి. వాటిలో 14 ఓహియో తరగతికి చెందిన ఖండాంతర క్షిపణులను ప్రయోగించేవి, అణ్వాయుధాలను నియంత్రిత మార్గంలో వేగంగా ప్రయోగిస్తాయి.ప్రతి జలాంతర్గామి అనేక అణుబాంబులను మోసుకుపోయే 20 ట్రైడెంట్ క్షిపణులను కలిగి ఉంటుంది. అవి ఏడున్నరవేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీస్తాయి. అందువలన వాటిని రష్యా సమీపంలోనే మోహరించనవసరం లేదు. ఈ జలాంతర్గామి పొడవు 170 మీటర్లు, బరువు 19వేల టన్నులు,159 మంది సిబ్బంది, గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.1990దశకం తర్వాత కొత్త జలాంతర్గాములు అవసరం లేదని, ఉన్నవాటిలో కొన్నింటిలో మార్పులు చేసి నియంత్రిత ప్రయోగవాహకాలుగా మార్చారు, అలా తయారు చేసిన నాలుగు జలాంతర్గాములు 154 తోమహాక్ క్షిపణులను, వెయ్యి పౌండ్ల బరువుగల పేలుడు పదార్దంతో 1,600కిలోమీటర్ల దూరంలో భూమి మీద ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. సముద్రగర్భంలో ఇతర దేశాల జలాంతర్గాములు, నౌకల మీద కూడా దాడి చేయ గలిగినవి ఉన్నాయి. 2025 జూలై ఒకటవ తేదీ నాటికి వేగంగా దాడులు చేసేందుకుగాను 23 అధునాతన వర్జీనియా రకం జలాంతార్గాములను వినియోగంలోకి తెచ్చారు, అవి 377 నుంచి 461 అడుగుల పొడవు, 10,200టన్నుల బరువు ఉంటాయి, ఒక్కోదానిలో 145 మంది సిబ్బంది పని చేస్తారు.పాతవాటిలో లాస్ ఏంజల్స్ రకం మరో 23 పని చేస్తున్నాయి.ఒక్కొక్కదాని ధర మూడు వందల కోట్ల డాలర్లు.
రష్యా భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేం దుకు అణు జలాంతర్గాములను విస్తరించాలని పుతిన్ పిలుపునిచ్చినట్లు గతనెలాఖరులోనే వార్తలు వచ్చాయి.ఆధునిక తరంతో నౌకాదళాన్ని మరింత పటిష్టం కావిస్తామని చెప్పినట్లు టాస్ వార్తా సంస్థ పేర్కొన్నది.ప్రస్తుతం 192 క్షిపణులను ప్రయోగించే పన్నెండు వినియోగంలో ఉన్నాయి. అమెరికాకు చెందిన లాస్ ఏంజల్స్ రకం జలాంతర్గామి జూలై తొమ్మిదిన నిర్వహణ పనుల పేరుతో తొలిసారిగా ఐస్‌లాండ్ రేవులో లంగరువేసింది.తామున్నామని తన మిత్రదేశాలకు అమెరికా పంపిన సందేశం కూడా దీనిలో ఇమిడి ఉంది. 2023 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వాహనాలు ఈ జలాల్లో సంచరించాయి. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, బ్రిటన్ కారిడార్ (జిఐయుకె)లో ఈ ప్రాంతం ఉంది.2019 నుంచి అమెరికా తన బి2 బాంబర్లకోసం ఈ ప్రాంతాన్ని వినియోగిస్తున్నది. ఈ పూర్వరంగంలో రష్యా ఉత్తర నౌకాదళానికి చెందిన అధునాతన యాసెన్ తరగతి జలాంతర్గాములు ఈ ప్రాంతంలో ప్రయాణించాయి.అమెరికా, రష్యా, చైనా జలాంతర్గాములు ప్రత్యర్ధుల కదలికలను పసిగట్టటం, పర్యవేక్షించే పనిలో నిరంతరం ఉంటాయి, ఏ దేశం కూడా ఈ వివరాలను బహిరంగంగా వెల్లడించదు. ఖనిజ సంపద ఎంతో ఉన్న ఈ ప్రాంతం ఆర్థికంగానే గాక, మిలిటరీ పరంగా కూడా ఇటీవల ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఐదోవంతు రష్యా భూభాగం, సముద్రతీరం సగం ఉన్నదున అది దానికి ఎంతో కీలకం. అమెరికా రాడార్లకు అందకుండా ప్రయాణించే హైపర్‌సోనిక్ క్షిపణులను రష్యా పరీక్షిస్తున్నది. రెండేండ్ల క్రితం చైనాతో కలసి అలాస్కా వద్ద తనిఖీ నిర్వ హించింది. పోలార్ సిల్క్ మార్గం పేరుతో 2018లో చైనా ఆర్కిటిక్ వ్యూహాన్ని ప్రకటించింది. నాటో కూటమిలో ఫిన్లండ్, స్వీడన్ చేరిన తర్వాత రష్యా తన మిలిటరీని ఈ ప్రాంతంలో నవీకరిస్తున్నది. సోవియట్ కాలం నాటి వైమానిక కేంద్రాల ఉన్నతీకరణ, కార్యకలాపాల పునరుద్దరణ చేపట్టింది. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యాకు ఎక్కువ మిలిటరీ కేంద్రాలు ఉండటం అమెరికాను కలవర పెడుతున్నది. రష్యా కంటే మిలిటరీ రీత్యా పశ్చిమ దేశాలు పదేండ్లు వెనుకబడి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం నాటో దేశమైన నార్వేలో రష్యన్ పౌరులు వీసాతో నిమిత్తం లేకుండా నివసించవచ్చు. గ్రీన్‌లాండ్‌ను తమకు ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేయటం వెనుక ఈ అంశం కూడా ఉంది. యుద్ధమంటూ వస్తే ఈ ప్రాంతంలో అమెరికా నౌకలను అడ్డుకునేందుకు రష్యాకు అనేక అవకాశాలున్నాయి.
దౌత్యం, వాణిజ్యాలను ఆయుధాలు మార్చుకోవటం రోజు రోజుకూ పెరుగుతున్నది. తన మిత్రదేశమైన పాకిస్తాన్ మీద భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయించేందుకు వాణిజ్యాన్ని చూపి బెదిరించిట్లు స్వయంగా ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. పరువు పోతుందని భావించి నరేంద్రమోడీ ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరిం చేందుకు సిద్ధం కావటం లేదన్నది వేరే సంగతి.మిలిటరీ ఖర్చును భారీగా పెంచేందుకు నాటో కూటమి నిర్ణయించింది. ఉక్రెయిన్ పోరును సంప్రదింపుల ద్వారా ముగించేందుకు అది సిద్ధంగా లేదు. పోరును దీర్ఘకాలం పొడిగించి రష్యాను కొన్నేండ్లలో దివాలా తీయించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ఐరోపా సమాఖ్య జనాభా 49 కోట్లు, జీడీపీ 20లక్షల కోట్లు ఉండగా కేవలం 15కోట్ల జనాభా, రెండు లక్షల కోట్ల డాలర్ల జీడీపీ మాత్రమే ఉన్న రష్యాను ఓడించలేమా అనే ప్రమాదకర ధోరణి కనిపిస్తున్నది. రష్యా తన వద్ద ఉన్న అణ్వస్త్రాలను చూపి భయపెడుతున్నది. అమెరికా కూడా భయ పడుతున్నది ఈ కారణంగానే అన్నది తెలిసిందే. ఐరోపాలో బలమైన జర్మనీ మరోసారి పదాతిదళాలను పెంచుతున్నది. మూడువేల బాక్సర్ సాయుధ శకటాలు, మూడున్నరవేల పాట్రియా ఇన్‌ఫాంట్రీ యుద్ధ వాహనాలను కొనుగోలు చేస్తున్నది, ఇవిగా యూరోజెట్ ఫైటర్లను సమీకరిస్తున్నది. ఐరోపాలో బలమైన సాంప్రదాయ మిలిటరీని సాయుధంకావించేందుకు తాను లక్ష కోట్ల యూరోలను ఖర్చు చేయనున్నట్లు జర్మన్ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ ఇటీవల ప్రకటించిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇతర ధనిక ఐరోపా దేశాలేమీ తక్కువ తినటం లేదు.ఫ్రాన్సు, ఇటలీ, పోలాండ్ పెద్ద సంఖ్యలో టాంక్‌లు, సాయుధశకటాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించాయి. అవసరమైతే ఫ్రెంచ్ లేదా ఐరోపా యూనియన్ దేశాలు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు కాల్బలాలను కూడా పంపేందుకు సిద్ధం కావాలని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ గతేడాది చేసిన ప్రతిపాదనను అందరూ వ్యతిరేకించారు. పశ్చిమ ఐరోపాలో 89శాతం మంది వ్యతిరేకిం చినట్లు సర్వేలు వెల్లడించాయి.
రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకుని డోనాల్డ్ ట్రంప్ తన అక్కసును జలాంతర్గాముల మోహరింపు రూపంలో వ్యక్తం చేశాడని స్పష్టంగా కనిపిస్తోంది. రెచ్చగొట్ట టంలో ఎవరూ తక్కువ తినలేదు. ట్రంప్ పన్నుల విధింపు పేరుతో బెదిరింపు ఆటకు దిగాడని మెద్వెదేవ్ వర్ణించాడు ”రష్యా అంటే ఇజ్రాయిల్ లేదా కనీసం ఇరాన్ కూడా కాదు, ప్రతి కొత్త బెదిరింపు యుద్ధంవైపు మరో అడుగు వేసినట్లే, అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య కాదు, అతగాడి స్వంతదేశంతోనే, అది ఎలా ఉంటుందో ఒక టీవీలో వస్తున్నది వాకింగ్ డెడ్ అనే సీరియల్ చూడవచ్చు” అన్నాడు. తీవ్రంగా రెచ్చగొట్టిన మెద్వెదేవ్ కారణంగానే తాను రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని ఆదేశించినట్లు ట్రంప్ చెప్పుకు న్నాడు. వీటన్నింటిని చూస్తుంటే ప్రధాన దేశాల మధ్య వాణిజ్య , మిలిటరీ విబేధాలు అదుపుతప్పి దిగజారుతున్నట్లు కనిపిస్తున్నది.అన్ని దేశాలను అదుపులోకి తెస్తానని చెప్పిన ట్రంప్ స్వజనంలో పలుచనయ్యాడు. పుతిన్‌ను దారికి తెచ్చి ఉక్రెయిన్ పోరును 24 గంటల్లో ఆపివేస్తానని ప్రగల్భాలు పలికి ఐరోపాలో పరువు పోగొట్టుకున్నాడు. గత కొద్ది రోజులుగా ట్రంప్‌తో పాటు అతగాడి యంత్రాంగంలో ముఖ్యులు నిరాశాపూరితంగా మాట్లాడుతున్నారు. ఆంక్షలు రష్యాను నిలువరించేట్లు కనిపించటం లేదన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ బెదిరింపులను ఖాతరు చేయకుండా రష్యా నుంచి భారత్, చైనా చమురు కొనుగోళ్లను నిలిపివేసే సూచనలు కనిపించటం లేదు. భారత్ నిలిపివేస్తే నరేంద్రమోడీకి, కొనుగోలు కొనసాగిస్తే ట్రంప్‌కు ఇరకాటం తప్పదు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయటంలో అత్యంత కీలక భాగస్వామి పుతిన్‌ను చైనా నేత షి జిన్‌పింగ్ మధ్యలో వదలివేస్తారని ఊహించటం కష్టమని న్యూయార్క్‌టైమ్స్ పత్రిక గురువారం నాడు వ్యాఖ్యానించింది. ఐరోపా యూనియన్ కూడా ఆంక్షలను ప్రకటించినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా టర్కీ, ఫ్రాన్సు,హంగరీ, బెల్జియం,స్లోవేకియా, ఇటలీ జెకియా గ్యాస్, చమురు కొనుగోలు చేస్తున్నాయి. భారత్ చౌకగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని బహిరంగ మార్కెట్‌లో అధికధరలకు అమ్ముకుంటున్నదని, అందువలన తాను భారీగా పన్నులు వేస్తానని సోమవారం నాడు ట్రంప్ పునరుద్ఘాటించాడు. ఒక్క ఈ అంశమే కాదు, పెట్టుబడిదారీ వర్గం తన లాభాలకు దెబ్బతగలకుండా మరోవైపున కార్మికవర్గం మీద కూడా దాడులను ప్రారంభించింది. అనేక దేశాల్లో రకరకాల సాకులతో సంక్షేమ, సామాజిక భద్రతా పథకాలకు కోత పెడుతున్నారు. ఇలాంటి పోకడలను ఎదిరించి అడ్డుకట్టవేయాలంటే అమెరికా, ఐరోపాల్లోని కార్మికవర్గం వీధుల్లోకి వస్తే తప్ప పాలకవర్గాలు వెనకడుగువేసేట్లు కనిపించటం లేదు.
ఎం కోటేశ్వరరావు
8331013288
జలాంతర్గాముల మోహరింపు : రష్యాను కవ్విస్తున్న ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES