బీసీ కమిషన్‌తో విద్యాశాఖ అధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థుల వివరాలను మార్చిలోగా సేకరించి అందజేస్తామని విద్యాశాఖ అధికారులు బీసీ కమిషన్ చైర్మెన్ తో తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో విద్యార్థుల సమాచారాన్ని కులాల వారిగా సేకరించే అంశంపై నిర్వహించిన సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్.నవీన్ నికోలస్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె.నాగార్జున రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృష్ణ ఆదిత్య హాజరయ్యారు. బీసీ కమిషన్ చైర్మెన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, మెంబర్ సెక్రెటరీ బాల మాయా దేవి పాల్గొని వారితో చర్చించారు. రాష్ట్రంలో విద్యార్థుల డేటా సేకరించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నం దున ప్రాధాన్యతగా తీసుకోవాలనీ, సమాచారం సేకరించి, కమిషన్‌కు అందించాలని నిరంజన్ వారిని కోరారు. ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులానికి, ఏ వర్గానికి చెందినవారు విద్యకు దూరంగా ఉంటున్నారో గుర్తించి, వారిని ప్రోత్సహించే అవకాశం కలుగుతుందని ఆయన వివరించారు. దీంతో విద్యాశాఖ అధికారులు, వెంటనే సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. శ్రీరామ్ వెంకటేశ్ మాట్లాడుతూ ఈ ఏడాది అడ్మిషన్లు, రాబోయే విద్యా సంవత్సరం నుంచి జరిగే ప్రవేశ పరీక్షల్లోనూ కుల సంబంధిత సమాచారాన్ని సేకరిస్తామని స్పష్టం చేశారు.
మార్చిలోగా బీసీ విద్యార్థుల వివరాల అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



