రూ.30వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ అరెస్టు
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ఖమ్మంరూరల్ సబ్ రిజిస్ట్రార్ జె.అరుణ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఓ తండ్రి తన కుమారునికి భూమిని గిఫ్టుగా రిజిస్ట్రేషన్ చేస్తున్న క్రమంలో సబ్ రిజిస్ట్రార్ కాసుల వేటకు దిగింది. దాంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, సర్కారు నిబంధనలకు విరుద్ధంగా కుప్పలు తెప్పలుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న ఆమె తీరుపై గతంలోనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం నగరానికి చెందిన ఏలూరి రామకృష్ణకు ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడులో రెండు వేల గజాల స్థలం ఉంది. ఆ భూమిని తన కుమారుడు శ్రీ చరణ్ పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలని అనుకున్నాడు. ఇందుకు ప్రభుత్వపరంగా రూ.51 వేల చలానాను తీసి రిజిస్ట్రేషన్‌కు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో డాక్యుమెంట్ రైటర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ కాసుల వేటకు దిగింది. రామకృష్ణను తొలుత రూ.50 వేలు లంచంగా అడిగారు. అందుకు డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్వర్లు సబ్ రిజిస్ట్రార్‌కు మధ్యవర్తిగా వ్యవహరించాడు. అయితే అంత మొత్తం తాను ఇచ్చుకోలేనని ప్రాథేయపడినా కనికరించలేదు. ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. కొద్ది రోజుల తర్వాత రూ.30 వేలు ఇచ్చుకోగలనని రామకృష్ణ చెప్పడంతో అందుకు అంగీకరించారు. అనంతరం రామకృష్ణ ఏసీబీ డీఎస్‌పీ రమేష్‌ను ఆశ్రయించాడు. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. సోమవారం ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదుట మాటు వేశారు. తొలుత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి కానిచ్చారు. అనంతరం మీడియేటర్‌గా వ్యవహరించిన పుచ్చకాయల వెంకటేశ్వర్లుకు రూ.30 వేలు ఇచ్చే క్రమంలో అత్యంత చాకచక్యంగా అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్
- Advertisement -
- Advertisement -