‘కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదీ చేత కాకపోతే పాకుతూపో అంతేకానీ ఒకేచోట వుండిపోకు’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. నువ్వు పరిగెత్తినా, నిలబడినా కాలం నీ కోసం ఆగదు. మరి అలాంటప్పుడు మీ ఆలోచనలు ఎంత నిర్మాణాత్మకంగా ఉండాలో ఆలోచించండి. సష్టిలో మనిషి మాత్రమే ప్రత్యేకమైన జీవి. ఇన్ని ప్రత్యేకతలు వున్న మనం ఎలా జీవించాలి అన్నది మనపైనే ఆధారపడి వుంటుంది. ఎలాంటి ‘లక్ష్యాలను’ ఎంచుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరిని కలవాలి. ఎలాంటి సలహాలు, సూచనలు తీసుకోవాలి..? అనేది మన విచక్షణ మీద ఆధారపడి వుంటుంది. ఈ ప్రయత్నంలో మీరు ఎంత ధఢంగా తయారవ్వాలి అంటే ఇక మీద ఏ సమస్య కూడా మీ దరి చేరకుండా వుండాలి. అంత బలంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి అప్పుడే మీరు పరిపూర్ణులు అయినట్లుగా భావించాలి.
పెద్ద బండరాయిని పగులగొట్టాలనుకున్న వ్యక్తి సుత్తితో 20-30 దెబ్బలు దానిపై వేస్తాడు. అది 29-30వ దెబ్బకి రెండు ముక్కలవుతుంది. అంటే అతడు ఆ రాయిపై వేసిన మొదటి దెబ్బ వధా ఐనదని కాదు. మొదటి దెబ్బ నుండి చివరి దెబ్బ వరకు దానిపై ప్రభావం చూయించిందని భావించాలి. ఒక లక్ష్యం నిర్దేశించుకొని అందులో అవరోధాలు/ అవంతరాలు వస్తే అక్కడే ఆగిపోకూడదు. తిరిగి ప్రయత్నం చేయాలి. మీరు ఒక అడుగు వేస్తే కాలం మీతో రెండడుగులు వేసేలా చేస్తుంది. అప్పుడు మీరు తప్పక గెలుస్తారు. ‘కెరటం నాకు ఆదర్శం లేచి పడినందుకుకాదు, పడినా లేస్తున్నందుకు’ అంటాడు స్వామి వివేకానంద. మీ బాల్యం ఓ సారి గుర్తు తెచ్చుకోండి ఎక్కడా పడకుండానే లేచి నిలబడ్డారా!
మీలో ఎవరికైనా సివిల్ సర్వీసెస్ లక్ష్యం ఐతే గతంలో విజయం సాధించిన వారిని కలవండి. వారిచ్చే సలహాలు సూచనలు పాటించండి. గతంలో వచ్చిన ప్రశ్నల సరళిని పరిశీలించండి. సిలబస్ వారిగా ప్లాన్ చేసుకోండి. లేదా ఓ వ్యాపారం పెట్టాలనే ఆలోచన మీకు వస్తే అందులో విజయం సాధించిన వారిని అడగండి. మార్కెట్ సూత్రాలు, వినియోగదారుల ఇష్టా ఇష్టాలు తెల్సుకుంటే మీరు కచ్చితంగా విజయం సాధించినట్లే. దేశీయంగా ప్రారంభించబడిన రాంరాజ్ కాటన్ మిల్స్ స్థాపకుడు నాగరాజన్ 1983లో తమిళనాడులోని తిరుపూర్‌లో చిన్న వస్త్ర పరిశ్రమను స్థాపించి నేడు వాటి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాడంటే ఎలా సాధ్యపడిందో ఓసారి తెల్సుకోండి. కాఫీ డే నిర్వహణలో మాళవిక హేగ్దే పడిన కష్టాలు, ప్రస్తుతం దాని మార్కెట్ విలువ తెల్సుకోండి. బిజినెస్ మెళకువలు తెల్సుకోకుండా కోట్ల వ్యాపారం చేయడం ఆ పోటిలో నిలబడటం చాలా కష్టం. అందుకే వినుత్నంగా ఆలోచించిన వారే పోటీ ప్రపంచంలో నిలబడగలరు. వినియోదారులు కూడా అలాంటి వారినే ఆదరిస్తారు. ‘ఎక్కడి నుండి వచ్చామన్నది కాదు ఎలా ప్రారంభించామన్నది ముఖ్యం’. ఎప్పటికప్పుడు మార్కెట్ మెలుకువలు తెల్సుకుంటూ ముందుకు వెళ్ళిన వారినే సక్సెస్ వరిస్తుంది.
మీకు ఏదైనా ఆట మీద ఆసక్తి వుంటే వివిధ క్రీడలలో ప్రపంచ స్థాయికి ఎదిగిన వారి గురించి తెల్సుకోండి. ఈ మధ్యనే (28-04-2025) ఐ.పీ.ఎల్. మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున గుజరాత్ జట్టుతో ఆడిన వైభవ్ సూర్యవంశి ఆటను ఒక్కసారి పరిశీలించండి. కేవలం 38 బంతుల్లో సెంచరీ (101) చేయడం అంటే మామూలు విషయం కాదు. తక్కువ వయసులో (14 సం.రాల 32 రోజులు) అందులో 11 సిక్సులు, 7 ఫోర్లు ఉండటం విశేషం. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఒక్క రోజులో సాధ్యం కాలేదు. క్రికెట్ పైన ఉన్న ప్రేమ, అహౌరాత్రులు చేసిన బ్యాటింగ్ ప్రాక్టీస్ (శ్రమ). నేడు మనం చూసిన మెరుపు ఇన్నింగ్స్. రాత్రికిరాత్రే స్టార్ హౌదా ప్రపంచం దష్టి తనపై పడేలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
జీవితంలో ఒక్కసారి మాత్రమే అవకాశం వస్తుంది. అప్రమత్తంగా వుండి అలాంటి అవకాశాలను ఒడిసి పట్టుకొన్న వారే విజేతలౌతారు. పరాధీనంగా వుండి అవకాశాలను చేజార్చుకున్నవారు పరాజితులుగా మిగిలిపోతారు. ‘ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది’. ‘శ్రమ నీ ఆయుధం ఐతే విజయం నీ బానిస అవుతుంది’ అంటాడు నెపోలియన్.
బానిసత్వానికి అలవాటుపడిన వ్యక్తి ఎప్పటికీ తన బలాన్ని గుర్తించలేడు. గమ్యం చేరుకోవడానికి చాలా మార్గాలు వుంటాయి. వాటిలో మనం ఏ మార్గం ఎంచుకుంటున్నాము అనే దానిపై మన భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఆశావాద దక్పధంతో అడుగు ముందుకు వేయడమే. ‘నీటి జాడలున్న చోట బావిని తవ్వాలని అనుకోవాలి ఎడారిలో మాత్రం కాదు’ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈ నాల్గింటిని (inspiration, Plan hardwork Coordination స్ఫూర్తి, ప్రణాళిక, శ్రమ, సమన్వయం) మీరు సమన్వయం చేసుకుంటే కచ్చితంగా గెలుస్తారు. మీరు ఓ క్రికెట్ మ్యాచ్‌ను చూడండి. గెలిచిన వారికి ఓడిన వారికీ తేడా ఏంటో ఓ సారి గమనించండి. గెలిచినా వారి గెలుపు గాలివాటంగా వచ్చిందా? ఓడిన వారు ఎలాంటి తప్పులు చేయకుండానే ఓడిపోయారా ఆలోచించండి? గెలిచిన జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో ప్రత్యర్ధి జట్టు కన్నా మంచి ప్రదర్శన చేయడం వల్లనే గెలిచింది. అలాగే ఓడిన జట్టు ఈ విభాగాలలో మంచి ప్రదర్శన చేయకపోవడం వల్లనే ఓడిపోయిందన్నది వాస్తవం.
ఈ మౌళికమైన అంశాలు మీరు చేయబోయే ఏ పనికైనా అన్వయించుకోండి. అలాగే అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతిపాదించిన యత్న దోష పద్ధతి (Trial and error method) గూర్చి తెల్సుకోండి. మీ కళ్ళముందే చిన్న పిల్లవాడు సైకిల్ నేర్చుకోవడానికి పడుతూ లేస్తు ఉంటాడు. చివరికి అందులో పట్టు సంపాదిస్తాడు. ఇలా బాల్యంలో మీరు కూడా చేసి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత మనం మర్చిపోతాము. అభ్యాసన సంసిద్దత,(Readiness) అభ్యాసం, (Exercise) ఫలితం (Result) ఈ మూడింటిలో మొదటి రెండింటి మీదనే మీరు చేయబోయే ఫలితం ఆధారపడి వుంటుంది. ఎక్కడ లోపం జరిగినా తిరిగి మళ్ళీ మొదటి నుండి ప్రారంభించాల్సిందే. కాబట్టి పై సూత్రాలను అనుసరించి మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తూ….
– డా||మహ్మద్ హసన్, 9908059234
శ్రమ ఆయుధమైతే విజయం నీ బానిస
- Advertisement -
- Advertisement -